కేంద్ర ఎర్త్ సైన్సెస్ మంత్రిత్వ శాఖ షాకింగ్ వివరాలను వెల్లడించింది. దేశంలో 6 నెలల వ్యవధిలో ఏకంగా 413 భూకంపాలు వచ్చాయని తెలిపింది. నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ (ఎన్‌సీఎస్) ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న నేషనల్ సీస్మొలాజిక్ నెట్‌వర్క్ మార్చి 1 నుంచి సెప్టెంబర్ 8 మధ్య కాలంలో దేశవ్యాప్తంగా పలు చోట్ల మొత్తం 413 భూకంపాలను రికార్డు చేసింది. ఈ మేరకు సదరు మంత్రిత్వ శాఖ మంగళవారం రాజ్యసభలో సభ్యులు అడిగిన ఓ ప్రశ్నకు సమాధానాలు చెప్పింది.
మార్చి 1 నుంచి సెప్టెంబర్ 8 మధ్య దేశవ్యాప్తంగా మొత్తం 413 భూకంపాలు సంభవించగా.. వాటిల్లో 135 భూకంపాల తీవ్రత రిక్టర్ స్కేలుపై 3.0 అంతకన్నా తక్కువగా నమోదైందని తెలిపారు. వాటిని మెషిన్లు ఉంటే తప్ప గుర్తించలేమని తెలిపారు. ఇక మరో 153 భూకంపాలు తీవ్రత 3.0 నుంచి 3.9 మధ్య నమోదైందని.. వీటిని సాధారణ ప్రజలు గుర్తించారని అన్నారు. కానీ వీటి వల్ల ఎలాంటి నష్టం కలగలేదని తెలిపారు.
ఇక మరో 114 భూకంపాల తీవ్రత 4.0 నుంచి 4.9 మధ్య నమోదైందని వీటి వల్ల స్వల్పంగా నష్టం కలిగిందని తెలిపారు. మరో 11 భూకంపాల తీవ్రత 5.0 నుంచి 5.7 మధ్య నమోదైందని, వీటి వల్ల ఒక మోస్తరు నష్టం కలిగిందని వివరించారు.