రాష్ట్రంలో ఇప్పుడు కరోనా ఎఫెక్ట్ తీవ్రంగా ఉంది. దీంతో లాక్‌డౌన్‌ను పటిష్టంగా అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు రోడ్లమీదకు రాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో అనాధలు, వృద్ధులు, బిక్షగాళ్లు, వలసకూలీలు.. కడు పేదలు, నిరుపేదలు ఇలా అనేక వర్గాలు ఆహారం లేక రోడ్డున పడ్డాయి. వీరిని ఆదుకునేందుకు స్వచ్ఛంద సంస్థలు ముందుకు వస్తున్నాయి. అదేసమయంలో రాజకీయ నేతలు కూడా వస్తున్నారు. దీంతో చాలా జిల్లా్లలో ఆహారం అందించేందుకు ఇతర సామాగ్రి అందించేందుకు నాయకులు పోటీ పడుతున్నారు.
ఇలా ఆపన్న హస్తం అందించడాన్ని ప్రతి ఒక్కరూ హర్షిస్తారు. అయితే, ఇది వివాదాలకు, పోలీసుల కేసులకు కూడా దారితీస్తుం డడమే ఇప్పుడు చర్చకు వస్తోంది. ఆపన్న హస్తం అందించడంలో వైసీపీ నేతలు ముందున్నారు. ముఖ్యంగా నెల్లూరు, చిత్తూరు నాయకులు పోటీ పడి మరీ పేదలకు అన్నం సహా ఇతర వస్తువులు అందిస్తున్నారు. అయితే, ఈ క్రమంలో వారు కరోనా ముంద స్తు జాగ్రత్తలు పాటించకపోవడం, అనుచరులను పెద్ద ఎత్తున తరలించడం వంటివి తీవ్ర వివాదాలకు కారణంగా మారుతున్నాయి. నెల్లూరులో సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి ఇటీవల పేదలకు అన్నం సహా కూరగాయలు పంచారు.
అయితే, ఆయన దీనిని రాజకీయం చేశారు. తనకు అనుకూలంగా వంద మంది కార్యకర్తలనుతరలించడం, ఆ తర్వాత పెద్ద వేదిక ఏర్పాటు చేసి రాజకీయ ప్రసంగాలు చేయడం వంటివి వివాదానికి దారితీశాయి. వీటిని టీడీపీ నేతలు తీవ్రస్థాయిలో తప్పుబడు తున్నారు. ప్రజలకు నీతులు చెబుతున్న వైసీపీ నాయకులు తమదాకావచ్చేసరికి మాత్రం ఇలా వ్యవహరిస్తున్నారంటూ.. వ్యాఖ్యలు సంధిస్తున్నారు. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి ఏకంగా ట్రాక్టర్లతో ర్యాలీ చేయడం తీవ్ర విమర్శలకు కారణమైంది.
ఇక రోజాకు తెలిసి జరిగినా తెలియకుండా జరిగినా ఆమెపై పూల వర్షం కురవడం జాతీయ మీడియాలో సైతం వైసీపీపై విమర్శలకు కారణమైంది. గుంటూరు జిల్లా చిలకలూరిపేట ఎమ్మెల్యే శైలీపై సైతం తీవ్ర విమర్శలు వస్తున్నాయి. అదేసమయంలో సీఎం జగన్‌పై నా విమర్శలు గుప్పిస్తున్నారు. నిజానికి కరోనా ఎఫెక్ట్ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటిస్తున్నారు. ప్రధాని మోడీ కూడా ముఖానికి మాస్క్ కట్టుకుని పనిచేస్తున్నారు. కానీ, మన రాష్ట్రంలో సీఎం జగన్ కానీ, విపక్ష నాయకుడు చంద్రబాబు కానీ ఎక్కడా మాస్క్ ధరించిన సందర్భం లేకపోవడంపైనా విమర్శలు వస్తుండడం గమనార్హం.