గతంలో పిల్లలు ఖాళీ సమయం దొరికితే ఎక్కువ సేపు బయట ఆటలు ఆడేవారు. కానీ ఫోన్లు, కంప్యూటర్ల రాకతో వారు క్రీడలు ఆడడం లేదు. ఆన్‌లైన్ గేమ్స్ ఆడుతున్నారు. ఇది వారిపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోంది. ఇక పబ్‌జి వంటి గేమ్స్ వల్ల పిల్లల్లో, యువతలో హింసా ప్రవృత్తి పెరిగిపోతోంది. అలాంటి గేమ్స్ ను ఆడడం కోసం వారు ఏం చేసేందుకైనా వెనుకాడడం లేదు. ఈ క్రమంలోనే పబ్‌జి లాంటి గేమ్స్ ను నిషేధించాలని కోరుతూ ఓ న్యాయమూర్తి తాజాగా ప్రధాని మోదీకి లేఖ రాశారు.
అడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జి నరేష్ కుమార్ లాకా తాజాగా ప్రధాని మోదీకి లేఖ రాశారు. ఫ్రీ ఫైర్, పబ్‌జి మొబైల్ (బ్యాటిల్ గ్రౌండ్స్ మొబైల్ ఇండియా) లాంటి గేమ్‌లను బ్యాన్ చేయాలని ఆయన లేఖలో పేర్కొన్నారు. ఈ గేమ్స్ వల్ల పిల్లలపై నెగెటివ్ ప్రభావం పడుతుందన్నారు. దీంతో వారి ఎదుగుదలపై ఆ గేమ్స్ ప్రభావం చూపిస్తున్నాయని అన్నారు. అందువల్ల గేమ్స్ ను బ్యాన్ చేయాలని కోరారు.
చైనాతోపాటు బంగ్లాదేశ్, నేపాల్ వంటి దేశాల్లో ఇప్పటికే అలాంటి గేమ్స్ ను బ్యాన్ చేశారని, కొన్ని చోట్ల పిల్లలు ఆ గేమ్స్ ను ఆడకుండా నిబంధనలను రూపొందించారని అన్నారు. అందువల్ల ఆ గేమ్స్ ను బ్యాన్ చేసి పిల్లల ఆరోగ్యాన్ని రక్షించాలని నరేష్ కుమార్ లేఖలో మోదీని కోరారు.
కాగా పబ్‌జి మొబైల్ గేమ్‌ను గతంలో భారత ప్రభుత్వం నిషేధించగా.. ఆ గేమ్ డెవలపర్ క్రాఫ్టన్ కంపెనీ చైనాకు చెందిన కంపెనీలతో ఒప్పందాలను రద్దు చేసుకుని సొంతంగా ఈ గేమ్‌ను బ్యాటిల్ గ్రౌండ్స్ మొబైల్ ఇండియా పేరిట భారత్‌లో ఇటీవల మళ్లీ లాంచ్ చేసింది. ఇటీవలి కాలంలో ఈ గేమ్స్‌లో చాలా మంది పిల్లలు పెద్ద ఎత్తున డబ్బులను ఖర్చు చేస్తున్న ఉదంతాలు కూడా చోటు చేసుకుంటున్నాయి. అందువల్లే ఈ గేమ్స్ ను నిషేధించాలని జడ్జి నరేష్ కుమార్ ప్రధాని మోదీని కోరారు.