కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంపై దాడి ఘటనలో గాయపడిన దళిత కార్యకర్త నందురాజ్ కుటుంబాన్ని పరామర్శించారు. పాతబస్తీలో బహదూర్ పురాలోని నందు ఇంటికి వెళ్లిన బండి సంజయ్ ఆయన ఆరోగ్య పరిస్థితిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. తలకు గాయం కావడంతో చికిత్స తీసుకున్నట్లు నందు వివరించారు. ఈ సందర్భంగా దాడి ఘటన పూర్వాపరాలను కేంద్ర మంత్రి అడిగి తెలుసుకున్నారు. నందురాజ్ త్వరగా కోలువాలని ఆకాంక్షించారు. అనంతరరం మీడియాకు ప్రకటన విడుదల చేశారు.
‘‘రాష్ట్రంలో కాంగ్రెస్ నేతలు బరితెగించి దాడులకు తెగబడుతున్నారు. పట్టపగలు అందరూ చూస్తుండగా ఇనుప రాడ్లు, రాళ్లు, గుడ్లు, కర్రలతో బిజెపి కార్యకర్తలపై దాడి చేసినా పోలీసులు ప్రేక్షక పాత్ర వహించడం సిగ్గు చేటు. నిన్న జరిగిన ఘటనను చూస్తే….కాంగ్రెస్ ప్రభుత్వమే ఈ దాడులను ప్రోత్సహిస్తున్నట్లు కన్పిస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వ అవినీతి, అరాచకాలపై బీజేపీ ఎప్పటి కప్పుడు నిలదీస్తుంటే ఓర్వలేక ఈ దాడులు చేయించినట్లు స్పష్టమవుతోంది. ప్రభుత్వాలు ప్రజల రక్షణ కోసం పనిచేయాలి. కాని, ప్రభుత్వం, పోలీసు యంత్రాంగమే ఇటువంటి దాడులను ప్రోత్సహించడం ఎంతవరకు సమంజసం.’’అని ప్రశ్నించారు.