భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన డిప్యూటీ డీఎంహెచ్ అధికారి నరేష్కుమార్ కరోనాతో మృతి చెందడం.. తనను తీవ్రంగా కలచివేసిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. జిల్లా వైద్యాధికారికి కూడా సరైన వైద్యం అందించలేకపోవడం చాలా దురదృష్టకరమని బండి సంజయ్ ఆవేదన వ్యక్తం చేశారు. వైద్యాధికారి కుటుంబాన్ని యశోదా ఆసుపత్రిలో రూ. లక్షల బిల్లులు చెల్లించమని వేధించడం హేయమైన చర్యగా ఒక ప్రకటనలో ఆయన అభివర్ణించారు.
ప్రజలకు కరోనా నుంచి కాపాడడానికి ప్రాణత్యాగం చేసిన నరేష్ కుటుంబాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. కేంద్రం అందించే రూ. 50 లక్షల బీమాకు తోడుగా రాష్ట్ర ప్రభుత్వం రూ. కోటి ఎక్స్గ్రేషియా చెల్లించాలని బండి సంజయ్ కోరారు. నరేష్కుమార్ భార్యకు గ్రూప్-1 స్థాయి ప్రభుత్వం ఉద్యోగం కల్పించి ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలని.. ప్రైవేట్ ఆసుపత్రులను ప్రభుత్వ నియంత్రణలోకి తీసుకొచ్చి బిల్లులకు కట్టడి చేసి ప్రజలకు భరోసా కల్పించాలని కోరారు.