టాలీవుడ్ లో మా ఎన్నికల హీట్ కొనసాగుతూనే ఉంది. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ ఎన్నికల వేడిని మరింత పెంచుతున్నారు. ఎన్నికల్లో ప్రకాష్ రాజ్, హేమ, జీవిత, మంచు విష్ణు, సివిఎల్ నరసింహారావు పోటీకి సిద్ధమవుతున్నట్టు ఇప్పటికే ప్రకటించారు. ఇక ప్రకాష్ రాజ్ ప్యానల్ ప్రకటించగా అందులో బండ్ల గణేష్ సభ్యుడు గా ఉన్న సంగతి తెలిసిందే. కాగా బండ్ల గణేష్ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. “మా” కు శాశ్వత భవనం అవసరం లేదని బండ్ల గణేష్ వ్యాఖ్యలు చేశారు.
శాశ్వత భవనం నిర్మించడం ప్రధాన అజెండాగా కొంతమంది బరిలోకి దిగుతున్నారని నిజం చెప్పాలంటే తాను మా బిల్డింగ్ కు వ్యతిరేకం అన్నారు. దానికంటే ముందు చేయాల్సిన పనులు ఎన్నో ఉన్నాయని చెప్పారు. మా లో ఉన్న 900 మంది దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నారని అన్నారు. సరైన ఆర్థిక స్థోమత లేకపోతే వారు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. తన ఉద్దేశం బిల్డింగ్ నిర్మాణం కోసం ఖర్చు చేసే 20 కోట్లతో పేద కళాకారులందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు నిర్మించి ఇస్తే బాగుంటుంది అన్నారు. ఇలాంటి పని కోసం మన హీరోలు కూడా ముందుకు వస్తారు బిల్డింగ్ లేకపోతే ఇండస్ట్రీ ఆగిపోదని సినిమా షూటింగ్ లు జరుగుతాయని.. సినిమాలు చూస్తారు అని వ్యాఖ్యానించారు.