అసైన్డ్ ల్యాండ్స్ ఆక్రమణల ఆరోపణల నేపథ్యంలో ఈటల రాజేందర్ టీఆర్ఎస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన సంగతి అందరికీ విదితమే. ఈ క్రమంలోనే మాజీ మంత్రి ఈటల బీజేపీలో చేరారు. అయితే, ఈటల టీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన క్రమంలో కేసీఆర్‌కు కొన్ని సూటి ప్రశ్నలు వేశారు. అందులో వేటికి కూడా టీఆర్ఎస్ అధినేత సమాధానం చెప్పలేదు. కానీ, వాటికి తన చేతలతోనే ఆన్సర్ ఇస్తున్నాడన్న చర్చ రాజకీయ వర్గాల్లో షురూ అయింది.
మొత్తానికి ప్రస్తుతం ఈటల రాజేందర్ ట్రెండ్ సెటర్ అనే అభిప్రాయం ప్రజల నుంచి వ్యక్తమవుతున్నది. ఒక్క ఉప ఎన్నిక వల్ల తెలంగాణ ప్రభుత్వం కూసాలు కదిలిపోతున్నాయని కొందరు పేర్కొంటున్నారు. ఈటల రాజేందర్ ఆనాడు సీఎంవోలో ఒక్క దళిత అధికారి కూడా లేడని ప్రశ్నించారు. మంత్రులెవరికీ గౌరవం ఉండటం లేదని, మంత్రి హరీశ్‌కు కూడా ప్రాధాన్యత లేదని తెలిపారు. కాగా, ‘దళిత బంధు’ లాంచింగ్ సభలో రాహుల్ బొజ్జాను సీఎంవో సెక్రెటరీగా నియమించారు కేసీఆర్. హుజురాబాద్ ఉప ఎన్నికకు ఇన్‌చార్జిగా ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావును నియమించారు.
హరీశ్ ఆల్రెడీ టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ తరఫున ‘ప్రజా ఆశీర్వాద సభ’ నిర్వహించి ప్రచారానికి శ్రీకారం చుట్టారు. మొత్తంగా ఈటల డిమాండ్స్‌ను సీఎం కేసీఆర్ నెరవేస్తున్నారనే చెప్పొచ్చు. ఇక మంత్రుల క్రియాశీలత కూడా పెరిగినట్లు కనిపిస్తున్నది. మంత్రులు కేవలం హుజురాబాద్‌లో మాత్రమే కాకుండా తెలంగాణాలోని జిల్లాల్లోనూ పర్యటిస్తున్నారు. శంకుస్థాపనలు చేస్తున్నారు. ఇలా ఈటల ప్రస్తుతం పొలిటికల్ ట్రెండ్ సెట్టర్‌గా నిలిచారనే వాదనను ఈటల అనుచరుగణం, బీజేపీ వర్గాలు వినిపిస్తున్నాయి. హుజురాబాద్ బై పోల్‌లో టీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థుల ప్రకటన రాగా, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ప్రకటించాల్సి ఉంది. కొండా సురేఖ పేరును దాదాపుగా ఖరారు చేసినట్లు తెలుస్తోంది. కానీ, అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇంకా రాలేదు.