భారత్‌లో యూపీఐకి గణనీయమైన ప్రజాదరణ లభిస్తోంది. డిజిటల్ చెల్లింపుల వృద్ధికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుండటంతో దీని వినియోగాన్ని ఆర్‌బీఐ ఎప్పటికప్పుడు విస్తరిస్తోంది. తాజాగా నగదు డిపాజిట్లను యూపీఐ ద్వారా చేసే సదుపాయాన్ని త్వరలో తీసుకురానున్నట్లు ఆర్‌బీఐ ఇవాళ ప్రకటించింది.
క్యాష్ డిపాజిట్ మెషీన్లలో ఇప్పటి వరకు డెబిట్ కార్డు ద్వారా మాత్రమే నగదు డిపాజిట్ చేసే సదుపాయం ఉన్న విషయం తెలిసిందే. త్వరలో యూపీఐని ఉపయోగించి కూడా సీడీఎంలో డబ్బును జమ చేసే వెసులుబాటును తీసుకొస్తున్నట్లు ఆర్‌బీఐ తాజాగా ప్రకటించింది. దీనికి సంబంధించిన మార్గదర్శకాలను త్వరలో ప్రకటిస్తామని తెలిపింది.
వినియోగదారులకు మరింత సౌలభ్యం కల్పించేందుకు ఆర్‌బీఐ మరో కీలక నిర్ణయం తీసుకుంది. థర్డ్-పార్టీ యూపీఐ యాప్‌ల ద్వారా ఆన్‌లైన్ వాలెట్లు, ప్రీ – లోడెడ్ గిఫ్ట్ కార్డుల వంటి ‘ప్రీపెయిడ్ పేమెంట్ ఇన్‌స్ట్రుమెంట్స్ (PPI)’ను సైతం అనుసంధానించేందుకు అనుమతించాలని నిర్ణయించింది. ప్రస్తుతం, UPI చెల్లింపులు చేయడానికి బ్యాంకు ఖాతాను అదే బ్యాంకు ఇచ్చే UPI యాప్ లేదా ఏదైనా థర్డ్ పార్టీ యాప్‌నకు అనుసంధానిస్తుండగా.. ఇకపై థర్డ్‌పార్టీ యాప్‌లకు సైతం పీపీఐలను లింక్ చేసే వెసులుబాటు తీసుకురానున్నట్లు ఆర్‌బీఐ శుక్రవారం ప్రకటించింది.