ఆర్థిక నిపుణులు, విశ్లేషకుల అంచనాలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిజం చేసింది. వారి అంచనాలకు అనుగుణంగా తాజాగా కీలక వడ్డీ రేట్లను సవరించింది. వరుసగా రెండో సారి రెపో రేటు తగ్గిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఈసారి రెపో రేటును 0.25 శాతం తగ్గిస్తున్నట్లు ఆర్బీఐ ప్రకటించింది. ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా సారథ్యంలోని ఎంపీసీ మూడు రోజుల సమావేశం సోమవారం ప్రారంభమైంది. ఈ మేరకు ద్రవ్య పరపతి విధాన కమిటీ నిర్ణయాలను ఇవాళ మల్హోత్రా వెల్లడించారు.
రెపో రేటును 0.25 శాతం తగ్గించడంతో ప్రస్తుతం 6.25 శాతం ఉన్న రెపో రేటు ప్రస్తుతం 6 శాతానికి దిగొచ్చింది. ఈ ఏడాది ఫిబ్రవరిలోనూ కీలక వడ్డి రేట్లను రిజర్వ్ బ్యాంక్ తగ్గించిన విషయం తెలిసిందే. ఏకంగా 25 బేసిస్ పాయింట్లను కేంద్ర బ్యాంకు తగ్గిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు వరుసగా రెండో సారి తగ్గిస్తూ ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పింది. రెపో రేటు తగ్గడంతో జనం హర్షం వ్యక్తం చేస్తున్నారు.