అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రపంచ దేశాలపై టారిఫ్ వార్ ప్రకటించిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున సుంకాలు విధిస్తూ వాణిజ్య యుద్ధభయాలకు ఆజ్యం పోశారు. ట్రంప్ టారిఫ్ లతో అంతర్జాతీయ మార్కెట్లతో పాటు ఆసియా మార్కెట్లు కుదేలవుతున్నాయి. అయితే భారీ సుంకాలు విధించిన ట్రంప్.. ఇతర దేశాలు తమపై విధిస్తున్న సుంకాల్లో తాము సగమే విధిస్తున్నట్లు వ్యాఖ్యానించడం గమనార్హం. ఈ నేపథ్యంలో ట్రంప్ భారత్‌పై తాము 26 శాతం సుంకాలు విధిస్తున్నట్లు ప్రకటించారు.
అయితే ట్రంప్ ప్రకటించిన 26 శాతం సుంకాలు ఇవాళ్టి నుంచి అమల్లోకి రానున్నాయి. ఈ నేపథ్యంలో దీనిపై ఈరోజు కేంద్ర మంత్రివర్గం భేటీ కానుంది. ఈ భేటీలో సుంకాలపై చర్చించే అవకాశం ఉంది. అయితే భారత్ పై 26 శాతం సుంకాలు విధిస్తూ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ తనకు గొప్ప స్నేహితుడని తెలిపారు. అయితే భారత్ అమెరికాతో సరైన విధంగా వ్యవహరించడం లేదని .. అమెరికాపై భారత్ 52 శాతం సుంకాలను విధిస్తోందని అన్నారు.