తెలంగాణ పేరు వింటే చాలు ఉద్యమాలు గుర్తుకొస్తాయి. ఉద్యమాలకు పుట్టినిల్లు అయిన తెలంగాణలో సంస్కృతి సంప్రదాయాలకు కూడా కొదువ లేదు. ముఖ్యంగా రాష్ట్ర సంస్కృతిని ప్రతిబింబించేది బతుకమ్మ పండుగ. సింపుల్‌గా చెప్పాలంటే పూలను అందంగా పేర్చి తెలంగాణ ఆడపడుచులు మన పూర్వీకులు మనకు అందించిన వారసత్వాన్ని భవిష్యత్ తరాలకు చాటిచెబుతున్నారు. అయితే, దసరాకు తెలంగాణలోని ఆడపడుచులు, మహిళలు బతుకమ్మ పండుగను ఘనంగా జరుపుకుంటారు.
అయితే, ఈ గడ్డ మీద పుట్టిపెరిగిన కొందరు సప్త సముద్రాలు దాటి విదేశాల్లో స్థిరపడినా ఇక్కడి సంప్రదాయాలు, సంస్కృతిని ఏ మాత్రం మరిచిపోవడం లేదు. ఈ క్రమంలోనే తెలంగాణ మట్టిలో పుట్టిన బిడ్డలు న్యూజిలాండ్‌లో బతుకమ్మ పండుగను ఏటా ఘనంగా నిర్వహించుకుంటున్నారు.తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ న్యూజిలాండ్ ఆధ్వర్యంలో ఆక్లాండ్‌లో శుక్రవారం సాయంత్రం బతుకమ్మ పోటీలను నిర్వహించారు. ఇందులో కొత్తగూడెం త్రీ ఇంక్లైన్ కార్మిక ప్రాంతానికి చెందిన చంద్రగిరి రేఖ పేర్చిన బతుకమ్మకి మొదటి బహుమతి లభించింది.న్యూజిలాండ్‌లో స్థిరపడిన తెలంగాణ మహిళలు పెద్ద ఎత్తున బతుకమ్మలను పేర్చి సంబరాలు జరుపుకున్నారు.