ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి నాలుగు నెలల పాలనా కాలంలో ఎన్నో సరికొత్త సంస్కరణలతో పాలనలో తనదైన ముద్ర వేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నా సొంత పార్టీ నేతల వ్యవహారాలతో ఆయన లేనిపోని చిక్కులు వచ్చి పడుతున్నాయి. అవినీతికి తావు లేకుండా అన్ని వర్గాలకు న్యాయం చేయాలన్న లక్ష్యంతో ముందుకు వెళుతున్న జగన్‌కు కొన్ని చోట్ల సొంత పార్టీ నేతల నుంచి ఇబ్బందులు తప్పడం లేదు. ముఖ్యంగా జగన్ క్యాబినెట్ దేశవ్యాప్తంగా హైలెట్ అయ్యింది. బడుగు బలహీన వర్గాలతో పాటు మహిళలకు 50 శాతం మంత్రి పదవి ఇచ్చిన జగన్ రాజకీయంగా పెద్ద సంచలనానికి తెర తీశారు.
జగన్ నిర్ణయంపై అన్ని సామాజిక వర్గాలు అసంతృప్తితో ఉన్న జగన్ సొంత సామాజిక వర్గమైన రెడ్డి సామాజిక వర్గం మాత్రం గుర్రుగా ఉంది. దీనిపై వైసీపీ నేతలు ఎవరు బాహాటంగా విమర్శలు చేయక పోయినా అంతర్గతంగా తమలో తాము మాత్రం రగిలిపోతున్నారు. రెడ్డి వర్గాన్ని జగన్ ఎందుకు పట్టించుకోవడం లేదని తమలో తాము మదన పడుతున్నారు. తాజాగా నెల్లూరు జిల్లాలో రెడ్డి వర్సెస్ బీసీ వివాదం రాజకీయంగా ప్రకంపనలు రేపుతోంది.
నెల్లూరు జిల్లాలో జరిగిన సాగునీటి మండలి సమావేశంలో ఈ విభేదాలు బైటపడ్డాయి. జిల్లానుంచి బీసీ ఎమ్మెల్యే అనిల్ మంత్రి కావడంతో. సీనియర్లు ఆనం రామనారాయణ రెడ్డి, కాకాణి గోవర్దన్ రెడ్డి నొచ్చుకున్నారు. ఈ ఇద్దరు సీనియర్లు కావడంతో వీరు ఎంపీ ఆదాలతో ఓ గ్రూపు గట్టి రాకీయం చేస్తున్నట్టు తెలుస్తోంది. మంత్రి అనిల్‌తో సఖ్యతతో ఉంటోన్న మరో ఎమ్మెల్యే కోటంరెడ్డితో వీరికి రాజకీయ విబేధాలు ఉండడంతో ఇప్పుడు నెల్లూరు వైసీపీ నిలువునా చీలిపోయింది.
ఇక అనిల్ భారీ నీటిపారుదల శాఖా మంత్రిగా ఉన్నారు. తాజాగా జరిగిన మీటింగ్‌లో ఆనం, కాకాణి నీటి పంపకాలపై రచ్చచేసి బైటకు వెళ్లిపోయారు. సోమశిల నిండుగా ఉన్నా నీటి పంపకాలు సరిగ్గా జరగడంలేదని బహిరంగంగా విమర్శలు చేశారు. మంత్రిగా అనిల్ వివరణ ఇచ్చేందుకు ప్రయత్నించినా వీరు వినిపించుకోలేదు. దీంతో అనిల్ పెద్ద రెడ్లు గ్రూపు కట్టారుగా అని అసహనం వ్యక్తం చేసే వరకు వెళ్లిందట.
ఇక ఇదే జిల్లాకు చెందిన మరో మంత్రి గౌతంరెడ్డి ఉన్నా ఆయన ఈ గ్రూపు రాజకీయాలకు దూరం. తన పని తాను చేసుకునే రకం. అయితే మిగిలిన రెడ్డి ఎమ్మెల్యేలు మాత్రం బీసీ మంత్రి అయిన అనిల్‌ను టార్గెట్ చేస్తుండడంతో ఇప్పుడు పార్టీ నిట్ట నిలువునా రెండుగా చీలిపోయింది. పార్టీకి కంచుకోటగా ఉన్న ఈ జిల్లాలో నేతల తీరుతో జగన్‌కు పెద్ద మైనస్‌గా మారింది.