సెప్టెంబర్ 19 నుంచి జరగాల్సిన ఐపీఎల్ 13వ ఎడిషన్ కోసం సిద్ధమవుతున్న వేళ బీసీసీఐ డైలమాలో పడినట్లు తెలుస్తోంది. ఐపీఎల్ జట్టు చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) సిబ్బంది, ప్లేయర్లు కరోనా బారిన పడడంతో బీసీసీఐ టోర్నీ షెడ్యూల్‌ను విడుదల చేయకుండా ఆగినట్లు సమాచారం. ఇప్పటికే ఐపీఎల్ షెడ్యూల్‌ను ప్రకటించాల్సి ఉన్నా ఆలస్యం అయింది. మరో రెండు రోజుల్లో షెడ్యూల్‌ను విడుదల చేస్తారని వార్తలు కూడా వచ్చాయి. అయితే సీఎస్‌కే సిబ్బంది, ప్లేయర్లు కరోనా బారిన పడడంతో షెడ్యూల్ విడుదలను బీసీసీఐ వాయిదా వేసిందని తెలుస్తోంది. దీనిపై ప్రస్తుతం బీసీసీఐ తీవ్రమైన గందరగోళంలో ఉన్నట్లు సమాచారం.
అయితే ఐపీఎల్‌కు ఇంకా సమయం ఉంది కనుక.. చికిత్స తీసుకుని అందరూ కోలుకోవచ్చు. అయినప్పటికీ ఇతర జట్లలో పరిస్థితి ఎలా ఉందనే విషయం ఇంకా అర్థం కావడం లేదు. ప్లేయర్లు, సిబ్బంది ఇప్పటికే దుబాయ్ చేరుకుని దాదాపుగా వారం గడుస్తున్నా.. ఇప్పుడు కరోనా బయట పడుతుండడం ఆందోళన కలిగిస్తోంది. టోర్నీ వరకు వచ్చే సరికి మరింత మంది కరోనా బారిన పడితే పరిస్థితి ఏమిటని ప్రస్తుతం బీసీసీఐ ఆలోచిస్తున్నట్లు తెలిసింది.
ఇక భారత్‌లో కరోనా కేసులు ఎక్కువగా ఉన్నాయని బీసీసీఐ ఐపీఎల్‌ను దుబాయ్‌కు మార్చింది. అయితే ఇప్పుడు జట్ల సభ్యులు, సిబ్బంది కరోనా బారిన పడుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ఈ క్రమంలో బీసీసీఐ షెడ్యూల్‌ను రిలీజ్ చేస్తుందా, అందులో ఏమైనా మార్పులు చేస్తుందా ? అన్న అనుమానాలు కలుగుతున్నాయి. కాగా దీనిపై మరో ఐదారు రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉందని తెలిసింది.