క్రికెట్ సీజన్ ప్రారంభమైందంటే చాలు.. ఎక్కడ చూసినా పందెం రాయుళ్లే. ఎవరికీ చిక్కకుండా.. ఎవరికీ దొరక్కుండా ఈ పందేలు జరుగుతుంటాయి. ఐపీఎల్ సీజన్ ఎప్పుడైతే ప్రారంభమైందో దేశంలో అప్పటినుంచే బెట్టింగ్ మాఫియా పుట్టుకొచ్చింది. దేనిమీద పందెం కాయాలనేది ఒకప్పటి మాట. ఇప్పుడు పందేనికేదీ కాదనర్హం అన్నట్లుగా పరిస్థితి మారిపోయింది. చేతిలో డబ్బులుంటే చాలు. మరో 24 గంటల్లో మున్సిపల్ ఎన్నికల ఫలితాలు బయటకు రాబోతున్నాయి. ఏపీలో బెట్టింగ్ వ్యాపారం జోరందుకోవడానికి ఇంతకంటే ఏం కావాలి? మధ్యవర్తులు రంగప్రవేశం చేశారు. బెట్టింగ్‌రాయుళ్ల మధ్య ఒప్పందం కుదురుస్తున్నారు. తమ వాటాకింద కొంత వెనకేసుకుంటున్నారు. ఇవన్నీ జరుగుతున్నాయని తెలిసిన పోలీసులు మాత్రం ఏమీ తెలియనట్లుగా ఉంటారు. ఏపీలో అది అన్నింటికన్నా చిత్రమైన విషయం.
ఇరుపార్టీలకు ప్రతిష్టాత్మకం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన నగరపాలక సంస్థ, పురపాలక సంఘాల ఎన్నికల ఫలితాలు ఆదివారం వెల్లడికానున్న సంగతి తెలిసిందే. విజయం సాధించడమనేది వైసీపీకి, టీడీపీకి ప్రతిష్టాత్మకంగా మారింది. ఈ రెండు పార్టీలతోపాటు మరో పార్టీ కూడా రంగంలోకి దిగింది. అదే బెట్టింగ్ పార్టీ. మేయర్ పీఠాలు ఎవరికి దక్కుతాయి? పురపాలక ఛైర్మన్లు ఎవరవుతారు? ఏ పార్టీకి ఎన్ని కార్పొరేషన్లు వస్తాయి? ఎన్ని పురపాలక సంఘాలు గెలుచుకుంటుంది? డివిజన్లలో ఎవరికి ఎంతెంత మెజార్టీ వస్తుంది? ఏ పార్టీకి ఎన్ని డివిజన్లు దక్కుతాయి? ఏ పార్టీలో ఎవరికి మేయరయ్యే అవకాశం ఉంది? డివిజన్లలో ఫలానా అభ్యర్థికి ఎంత మెజార్టీ రావచ్చు?… ఇలా పలు అంశాలపై బెట్టింగులు జరుగుతున్నాయి.
రూ.20 లక్షల నుంచి ప్రారంభమై…
నగర ఫలితాలపై రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు ప్రారంభస్థాయి పందెం ఉంది. పురపాలక ఫలితాలపై రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు ప్రారంభస్థాయి పందెం ఉంది. ఇప్పటికే మధ్యవర్తులు రంగప్రవేశం చేశారు. బెట్టింగ్‌రాయుళ్లు వీరిదగ్గర రూ.లక్షలు నిల్వచేశారు. కొన్ని ప్రాంతాల్లో ఒప్పందాలకు సంబంధించి రిజిస్ట్రేషన్లు కూడా జరిగాయి. బెట్టింగ్ ఎక్కడ జరుగుతోంది? మూలసూత్రధారులెవరు? ఎక్కడెక్కడ దాడిచేస్తే బెట్టింగ్ మాఫియాను నియంత్రింవచ్చు లాంటి విషయాలన్నీ పోలీసులకు బాగా తెలుసు. కానీ వారెవరూ ఏమీచేయలేని పరిస్థితి. ఎందుకంటే అధికారం చేతిలో వారు బందీ అయ్యారు కాబట్టి. మరో 24 గంటలు వేచిచూస్తే ఎవరెంత డబ్బులు పోగొట్టుకున్నారు? ఎవరెంత లాభపడ్డారనేది తెలుస్తుంది. అప్పటివరకు వేచిచూద్దాం!!