భాద్రపద మాసం విశిష్టతలు ఇవే !

-

ఆగస్టు 20 నుంచి భాద్రపద మాసం ప్రారంభం. భాద్రపదమాసం అంటే పూర్ణిమనాడు పూర్వాభాద్ర కాని లేక ఉత్తరాభాద్ర నక్షత్రంలో చంద్రుడు ఉండే మాసాన్ని భాద్రపద మాసం అని అంటారు. ఇది వర్షఋతువులో వచ్చేమాసం. ఈ మాసంలో రెండు విశేషాలు ఉన్నాయి. శుక్లపక్షంలో అంతా దేవతలకు, పూజలకు, నోములకు వ్రతాలకు ప్రాధాన్యమిచ్చేదిగా ఉంటే, కృష్ణ పక్ష కాలంలో పితృదేవతలకు నెలవైన మాసంగా చెపుతారు. విష్ణుమూర్తి దుష్ట శిక్షణ చేయడానికి శిష్ట రక్షణ చేయడానికి దశావతారాలు ఎత్తాడనే విషయం అందరికీ తెలుసు. ఆ దశావతారాల్లోని వరాహ అవతారం, వామన అవతార పూజలు ఈ మాసంలోనే చేస్తారు. అందుకే ఈ మాసంలో దశావతార వ్రతం చేయాలంటారు.

భాద్రపదమాసంలో శుక్లపక్షంలో వచ్చే అష్టమి శ్రీకృష్ణుని రాధను పూజించాలి. దీనినే రాధాష్టమి అంటారు. దీనివల్ల ప్రేమికులకు అనుకూలంగా ఉంటుంది. అలాగే వివాహం చేసుకున్నవారికి వైవాహిక జీవన సౌఖ్యం కూడా లభిస్తుంది. వారిద్దరి మధ్య అనురాగం పెరుగుతుంది. స్త్రీలు చేసే వ్రతం హరితాళిక, సువర్ణగౌరీ, పదహారు కుడుముల తదియ మొదలైనవి చేస్తారు. ఈ హరితాళిక సువర్ణగౌరీ పదహారు కుడుముల తదియ మొదలైన నోములు ఈ మూడు కూడా చవితి మందురోజు అనగా వేరు వేరు ప్రాంతాల వారు వేరు వేరుగా జరుపుకొంటారు. అన్ని సారాంశం ఒకటే ఈ రోజు ఉపవాసం ఉండడం. ముత్తైదువులకు వాయినాలు ఇవ్వడం ఈ రోజు ప్రత్యేకాంశం. చవితి రోజు గణపతి పూజ ముందురోజున వారి తల్లితండ్రులైన శివపార్వతుల పూజ చేయడం ఆనవాయితీ. ఈ పజలను వివాహం కాకముందు కన్యలు చేయడం వలన వారికి మంచి భర్త లభిస్తాడు. వివాహం అయిన ముత్తైదువులు చేయడం వలన వారి సౌభాగ్యం కలకాలం అలాగే ఉంటుంది.
ఉండ్రాళ్ళ తద్ది. ఇది బహుళ పక్షంలో చేసే వ్రతం. దేవతాపూజ చేసి వివాహం కాని వారు చేస్తారు. ఉండ్రాళ్ళు నైవేద్యం పెట్టి సాయంత్రం ఊయలలో ఊగుతారు.

వినాయకవ్రతం: ఆగస్టు 22 శనివారం వినాయకచవితి

వినాయకుడి ప్టుటిన రోజున ఈ పండుగ జరుపుకొంటారు. దీనికే చాలా పేర్లు, గణపతి చవితి అని, గణేష్ చతుర్థి ఇలా పిలుస్తారు. మనకు భాద్ర పదమాసంలో తెలిసిన వ్రతాల్లో ఇది ఒక్కటి మాత్రమే తెలుసు. ఈ పూజను చాలా నియమ నిష్ఠలతో చేస్తారు. వినాయకుడిని 21 రకాల పత్రాలతో పూజించి ఉండ్రాళ్ళు నైవేద్యం పెడతారు. విద్యార్థులు పుస్తకాలను పెట్టి పూజిస్తారు.

ఏకాదశి : దీనిని పరివర్తన ఏకాదశి అంటారు. తొలి ఏకాదశినాడు అనగా ఆషాఢ ఏకాదశినాడు శ్రీ మహావిష్ణువు శేషతల్పంపై శయనించి ఈ రోజున వేరే వైపుకు తిరుగుతాడు అనగా పరివర్తనం చెందుతాడు అని అర్థం. అందుకే ఈ ఏకాదశికి పరివర్తన ఏకాదశి అని పేరు. ఈ ఏకాదశి వ్రతం ఆచరించడం వలన కరువు కాటకాలు రావని ఒకవేళ వచ్చినా వాటినుంచి ఎలా బయట పడాలో తెలుస్తుందని ప్రతీతి.

ద్వాదశి : వామన జయంతి. దశావతారాల్లో ఒక అవతారం. శ్రీ మహావిష్ణువు బలిచక్రవర్తిని పాతాళానికి పంపించిన అవతారం. ఈ రోజున వామనపూజ చేసి నైవేద్యం పెట్టి పెరుగును దానం చేయాలని చెపుతారు.

చతుర్దశి : అనంత పద్మనాభ చతుర్దశి. ఇది కూడా విష్ణువుకు ఉండే పేర్లలో ఒకటి. అనంతుడుని. ఇందులో కూడా విష్ణువును పూజిస్తారు. దీనిని అనంత పద్మనాభచతుర్దశి, లేదా అనంతవ్రతం అనే పేర్లతో పిలుస్తారు.

అజ ఏకాదశి : దీనికే ధర్మప్రభ ఏకాదశి అని కూడా పేరు. పూర్వం హరిశ్చంద్రుడు ఆచరించాడని చెపుతారు. హరిశ్చంద్రుడు అన్నీ పోగొట్టుకుని కాటికాపరిగా ఉంటూ ఈ ఏకాదశిరోజున వ్రతం చేయడం వలన తిరిగి సుఖ సంపదలు, అష్టైశ్వర్యాలు, రాజ్యభోగాలు పొందాడని చెపుతారు.
ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఈ భాద్రపద మాసంలో వచ్చే ముఖ్యరోజుల్లో దానధర్మాలు ఎక్కువగా చేయాలి.

– శ్రీ

Read more RELATED
Recommended to you

Latest news