అంతర్జాతీయంగా కరోనా కేసులు అదుపులేకుండా పెరగడం కారణంగా దేశీయ స్టాక్ మార్కెట్లో నేడు అమ్మకాలు సునామీని సృష్టించాయి. దీనితో సెన్సెక్స్ 620 పాయింట్లు కోల్పోయి 36,033 వద్ద ముగిసింది. మరోవైపు నిఫ్టీ కూడా 195 పాయింట్లు కోల్పోయి 10,607 పాయింట్ల వద్ద ముగిసింది. రోజు మొదలైనప్పటి నుండి ఇన్వెస్టర్లు అమ్మకాలకు మొగ్గు చూపడంతో నేడు స్టాక్ మార్కెట్ భారీగా నష్టపోయింది. ఇక ఇంట్రాడే కనిష్ఠ స్థాయిలకు దగ్గరలోనే మార్కెట్లు ముగియడం అమ్మకాల తీవ్రతను తెలియపరుస్తుంది.
ఇక నిఫ్టీ 50 లో లాభనష్టాల విషయాన్ని చూస్తే.. డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్, టైటాన్ కంపెనీ, భారతీ ఇంఫ్రాటెల్ కంపెనీల షేర్లు లాభాల్లో ముగిశాయి. ఇందులో అత్యధికంగా డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ షేర్లు 2.14 శాతం లాభపడ్డాయి. ఇక మరోవైపు అత్యధికంగా నష్టపోయిన షేర్ల వివరాల్లోకి వస్తే.. ఇందుస్ ల్యాండ్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, జి ఎంటర్టైన్మెంట్, ఐచర్ మోటార్స్, మారుతి సుజుకి అత్యధికంగా నష్టపోయాయి. నేడు కేవలం మూడు కంపెనీల షేర్లు మాత్రమే లాభాల్లో ముగియడం నిజంగా గమనించాల్సిన విషయం. మరోవైపు అంతర్జాతీయంగా అమెరికా డాలర్ తో పోలిస్తే రూపాయి మారకపు విలువ 19 పైసలు లాభపడి 75.48 వద్ద కొనసాగుతోంది.