దేశీయ కరోనా వ్యాక్సిన్ తొలి దశ ట్రయల్స్ ఈ నెలలో మొదలవుతాయని ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ బలరామ్ భార్గవ వెల్లడించారు. భారత్‌లో 2 దేశీయ కరోనా టీకాలపై పరిశోధనలు జరుగుతున్నాయని తెలిపిన ఆయన ఎలుకలు, కుందేళ్లపై అధ్యయనాలు విజయవంతమయ్యాయని పేర్కొన్నారు. ఆ నివేదికలను డీసీజీఐకు పంపగా మానవులపై తొలి దశ ప్రయోగాలకు ఆమోదం లభించిందని వెల్లడించారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో సుమారు వెయ్యి మంది ఔత్సాహికులపై రెండు దేశీయ కరోనా టీకాలపై మానవ అధ్యయనాలు జరుగుతాయని బలరామ్ తెలిపారు.
రష్యా, చైనా దేశాలు ఇప్పటికే వేగవంతమైన టీకాల తయారీపై పరిశోధనలు చేశాయని, తొలి దశ ప్రయోగాల్లో అవి విజయం సాధించాయని ఆయన చెప్పారు. తాజాగా అమెరికా కూడా వేగవంతమైన పద్ధతిలో రెండు కరోనా టీకాలపై పరిశోధనలు చేస్తున్నదని, బ్రిటన్ కూడా ఆ దిశగా ఆలోచిస్తున్నదని ఐసీఎంఆర్ డీజీ బలరామ్ భార్గవ వివరించారు.