ఏపీ ప్రజలకు భారీ ఊరట. ఇక కరెంట్ ఛార్జీలు పెరగవట. ఆంధ్రప్రదేశ్ తూర్పు, మధ్య, దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థలు 2023-24 ఆర్థిక సంవత్సరానికి చేసిన వార్షిక ఆదాయ అవసరాలు, రిటైల్ సరఫరా ధరల ప్రతిపాదనల్లో గృహ విద్యుత్ వినియోగదారులకు, వాణిజ్య అవసరాలకు, సాధారణ పరిశ్రమల రంగానికి, స్థానిక సంస్థలకు, ప్రభుత్వ, ప్రైవేటు నీటిపారుదల ఎత్తిపోతల పథకాలకు విద్యుత్ చార్జీల పెంపుదల లేదని రాష్ట్ర ఇంధన శాఖ స్పష్టం చేసింది.
గురువారం ఇంధన శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం, వచ్చే ఆర్థిక సంవత్సరానికి డిస్కంలు చేసిన టారీఫ్ ప్రతిపాదనల సమగ్ర వివరాలను ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలికి గత నెల 30న సమర్పించాయి. వాటి ప్రతులు ఏపీ ఈ ఆర్ సి, పంపిణీ సంస్థల వెబ్ సైట్లలో ఉన్నాయి. నివేదిక ప్రతులు డిస్కంల ప్రధాన కార్యాలయంలోనూ, సర్కిల్ కార్యాలయాల్లోనూ అందుబాటులో ఉంచారు.