ఈటలకు చేదు అనుభవం.. గడియారాలు పగులగొట్టిన ప్రజలు

ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో హుజూరాబాద్ ఉపఎన్నిక హాట్ టాపిక్ అయిన విషయం తెలిసిందే. ఈ ఉపఎన్నికలో ఎవరు గెలుస్తారనే ఆసక్తి తెలంగాణ ప్రజల్లో బాగా పెరిగిపోయింది. నోటిఫికేషన్ రాకపోయినా సరే హుజూరాబాద్‌లో రాజకీయాలు వేడెక్కాయి. అటు అన్ని పార్టీలు ప్రచారం కొనసాగిస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి ఈటల రాజేందర్ కు దిమ్మ తిరిగే షాక్ తగిలింది.

హుజురాబాద్ నియోజకవర్గంలో వీణవంక మండలం ఎలబాక గ్రామంలో ఈటెల రాజేందర్ కు వ్యతిరేకంగా ఆ గ్రామ ప్రజలు నినాదాలు చేశారు. అంతే కాదు ఈటల రాజేందర్ పంపిన గోడ గడియారాలను పగలగొట్టారు గ్రామస్తులు. ఈటెల రాజేందర్ అభివృద్ధి చేయలేదని సిఎం కేసీఆర్ కే తమ ఓటు వేస్తామని నినాదాలు చేశారు ప్రజలు. ఎలబాక కాలనీ వాసులందరు కలిసి కారు గుర్తుకు ఓటు వేయాలని ప్రతిజ్ఞ కూడా చేశారు గ్రామస్తులు. ఇక అటు ఇల్లందకుంట మండలం ఎంపీపీ పావని, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు మోటపోతుల ఐలయ్య, ముగ్గురు సర్పంచ్‌లు టీఆర్ఎస్‌లో చేరారు. ఇల్లందకుంట టీఆర్ఎస్ మండల ఇంచార్జ్, ఎమ్మెల్యే రవి శంకర్ ఆధ్వర్యంలో వీరంతా టీఆర్ఎస్ కండువా కప్పుకున్నారు.