స్వాతంత్య్ర దినోత్సవానికి ముందు జమ్ము కశ్మీర్లో భారీగా పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. పుల్వామాలోని తహాబ్ క్రాసింగ్ వద్ద 25-30 కేజీల ఐఈడీని రికవరీ చేసుకున్నట్లు భద్రతా దళాలు వెల్లడించాయి. దీంతో భారీ ఉగ్రముప్పు తప్పినట్లైంది.
“పుల్వామా పోలీసులు, భద్రతా దళాలకు ఐఈడీ రవాణా గురించి పక్కా సమాచారం అందింది. తహాబ్ క్రాసింగ్ వద్ద 25 నుంచి 30 కిలోల ఐఈడీని స్వాధీనం చేసుకున్నాం” అని కశ్మీర్ అదనపు డీజీపీ విజయ్ కుమార్ వెల్లడించారు.
కాగా, కశ్మీర్లో భద్రతను కట్టుదిట్టం చేశారు అధికారులు. రైల్వే స్టేషన్లలో నిఘా పెట్టారు. స్వాతంత్ర్య దినోత్సవం నేపథ్యంలో అదనపు బలగాలను రంగంలోకి దించారు. ఉధంపుర్-కాట్రా రైల్వే లింక్ వద్ద భారీగా బలగాలు మోహరించారు. స్పెషల్ డాగ్ స్క్వాడ్, రైల్వే భద్రతా దళం స్టేషన్ల పరిసరాల్లో నిరంతరం గస్తీ కాస్తున్నాయి. ప్రయాణికులను, వారి సామగ్రిని ముమ్మరంగా తనిఖీ చేస్తున్నాయి.
మరోవైపు, బుద్గాంలో పోలీసులకు, ఉగ్రవాదులకు మధ్య ఎన్కౌంటర్ ప్రారంభమైంది. వాటర్హిల్ ప్రాంతంలో ఎన్కౌంటర్ జరుగుతోందని పోలీసులు తెలిపారు. ముగ్గురు ముష్కరులను భద్రతా దళాలు చుట్టుముట్టాయని తెలిపారు. ది రెసిస్టెన్స్ ఫ్రంట్, లష్కరే తొయిబా ముఠాకు చెందినవారిగా భావిస్తున్న వీరిని బలగాలు నిలువరించేందుకు ప్రయత్నిస్తున్నాయి. ముష్కరుల్లో లతీఫ్ రాథర్ సైతం ఉన్నాడని, కశ్మీర్లో రాహుల్ భట్, అమ్రీన్ భట్ సహా పలువురు పౌరులను చంపిన ఘటనల్లో అతడు కీలక నిందితుడని పోలీసులు తెలిపారు.
మంగళవారం ఉత్తర్‌ప్రదేశ్‌లోనూ ఐఈడీ కలకలం రేపింది. ఐసిస్‌తో లింకులు ఉన్న ఓ ఉగ్రవాదిని యూపీ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ గురువారం అరెస్టు చేసింది. ఆజంగఢ్‌లోని ముబారక్‌నగర్ నుంచి నిందితుడు సాబుద్దీన్‌ను అరెస్టు చేసిన పోలీసులు.. పలు సెక్షన్ల కింద కేసులను నమోదు చేశారు. స్వాతంత్ర్య దినోత్సవం రోజున దేశంలో ఐఈడీ బాంబుదాడి చేసేందుకు నిందితుడు కుట్రపన్నాడని పోలీసులు వెల్లడించారు.