ఏపీ నూత‌న గ‌వ‌ర్న‌ర్‌గా బిశ్వ‌భూష‌ణ్ హ‌రిచంద‌న్‌

-

కేంద్ర ప్ర‌భుత్వం ఏపీ రాష్ట్ర ప్ర‌జ‌ల‌ను ఆశ్చ‌ర్యానికి గురి చేసింది. ఆ రాష్ట్రానికి కొత్త గ‌వ‌ర్న‌ర్‌గా బిశ్వ‌భూష‌ణ్ హ‌రిచంద‌న్‌ను కేంద్ర ప్ర‌భుత్వం నియ‌మించింది.

కేంద్ర ప్ర‌భుత్వం ఏపీ రాష్ట్ర ప్ర‌జ‌ల‌ను ఆశ్చ‌ర్యానికి గురి చేసింది. ఆ రాష్ట్రానికి కొత్త గ‌వ‌ర్న‌ర్‌గా బిశ్వ‌భూష‌ణ్ హ‌రిచంద‌న్‌ను కేంద్ర ప్ర‌భుత్వం నియ‌మించింది. ఇప్ప‌టి వ‌ర‌కు రెండు తెలుగు రాష్ట్రాల‌కు ఉమ్మ‌డి గ‌వ‌ర్న‌ర్‌గా ఈఎస్ఎల్ న‌ర‌సింహ‌న్ కొన‌సాగిన విష‌యం విదిత‌మే. ఈ క్ర‌మంలోనే త్వ‌ర‌లో ఆయ‌న్ను త‌ప్పించి రెండు తెలుగు రాష్ట్రాల‌కు వేర్వేరు గ‌వ‌ర్న‌ర్ల‌ను నియ‌మిస్తార‌ని జోరుగా ప్ర‌చారం సాగింది. అయితే ఓ ద‌శ‌లో మాజీ కేంద్ర మంత్రి సుష్మా స్వ‌రాజ్‌, మాజీ లోక్‌స‌భ స్పీక‌ర్ సుమిత్రా మ‌హాజ‌న్‌ల‌ను రెండు తెలుగు రాష్ట్రాల‌కు గ‌వ‌ర్న‌ర్లుగా నియ‌మిస్తార‌ని కూడా ప్ర‌చారం జ‌రిగింది. కానీ అంద‌రి అంచ‌నాల‌ను తారుమారు చేస్తూ కేంద్ర ప్ర‌భుత్వం ఈ నిర్ణ‌యం తీసుకుంది.

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర నూత‌న గ‌వ‌ర్న‌ర్‌గా ఒడిశా మాజీ మంత్రి బిశ్వ‌భూష‌ణ్ హ‌రిచంద‌న్‌ను కేంద్ర ప్ర‌భుత్వం నియ‌మించ‌గానే రాష్ట్ర‌ప‌తి భ‌వ‌న్ ఉత్త‌ర్వుల‌ను జారీ చేసింది. కాగా బిశ్వ‌భూష‌ణ్ హ‌రిచంద‌న్ ప్ర‌ముఖ న్యాయ‌వాది. ఈయన ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నిక‌య్యారు. అలాగే ఒడిశా న్యాయ‌శాఖ మంత్రిగా కూడా ఈయ‌న ప‌నిచేశారు. 1934 ఆగ‌స్టు 3వ తేదీన జ‌న్మించిన బిశ్వ‌భూష‌ణ్ బీఏ (హాన‌ర్స్‌), ఎల్ఎల్‌బీ చేశారు. కాగా అక‌స్మాత్తుగా ఈయ‌న ఏపీ గ‌వ‌ర్న‌ర్‌గా నియామ‌కం కావ‌డం రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ చ‌ర్చ‌నీయాంశ‌మ‌వుతోంది.

బిశ్వ‌భూష‌ణ్ హ‌రిచంద‌న్ గురించిన మ‌రిన్ని వివ‌రాలు…

1934 ఆగ‌స్టు 3వ తేదీన జ‌న్మించిన బిశ్వ‌భూష‌ణ్ హ‌రిచంద‌న్ బీఏ (హాన‌ర్స్‌), ఎల్ఎల్‌బీ చేశారు. ఆయ‌న తండ్రి కీర్తిశేషులు ప‌ర‌శురాం హ‌రిచంద‌న్‌. బిశ్వ‌భూష‌ణ్ భార్య పేరు సుప్ర‌వ హ‌రిచంద‌న్‌. కొంత‌కాలం ఈయ‌న లాయ‌ర్‌గా ప‌నిచేశారు. పుస్త‌క ప‌ఠ‌నం, క‌థ‌నాలు రాయ‌డం అంటే ఈయ‌న‌కు ఎంతో ఆస‌క్తి. చారిత్ర‌క ప్ర‌దేశాల‌ను చుట్టి రావ‌డం ఈయ‌న‌కు అల‌వాటు. అవినీతి, అన్యాయాల‌కు వ్య‌తిరేకంగా స‌మాజం పోరాటం చేయాల‌ని ఆశిస్తుంటారు. స‌మాజంలో ఉన్న పౌరులకు రాజ్యాంగం క‌ల్పించిన హ‌క్కులపై ఈయ‌న అవ‌గాహ‌న క‌ల్పిస్తుంటారు. ఈయ‌న ఇప్ప‌టి వ‌ర‌కు భువ‌నేశ్వ‌ర్‌లో ఉన్నారు. ఏపీకి కొత్త గ‌వ‌ర్న‌ర్ అయినందున త్వ‌ర‌లోనే అమ‌రావ‌తికి ఈయ‌న మ‌కాం మార‌నుంది.

1971లో భార‌తీయ జ‌న సంఘ్‌లో బిశ్వ‌భూష‌ణ్ చేరారు. ఆ త‌రువాత అదే పార్టీలో జాతీయ కార్య‌వ‌ర్గ స‌భ్యుడు అయ్యారు. అనంత‌రం ఆ పార్టీకి ఒడిశా రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా కూడా ప‌నిచేశారు. 1975లో బీజేపీలో చేరారు. ఆ త‌రువాత 1980 నుంచి 1988 వ‌ర‌కు ఒడిశా బీజేపీ అధ్య‌క్షుడిగా కొన‌సాగారు. ఆ త‌రువాత మ‌ళ్లీ 1988లో జ‌న‌తా పార్టీలో చేరారు. తిరిగి మ‌ళ్లీ 1996 ఏప్రిల్ 4వ తేదీన బీజేపీలో చేరారు. బిశ్వ‌భూష‌ణ్ మ‌రు బ‌టాస్‌, రాణా ప్ర‌తాప్‌, శేష ఝ‌ల‌క్‌, ఆస్తా శిఖ‌, మాన‌సి అనే పుస్త‌కాల‌ను రాశారు. భువ‌నేశ్వ‌ర్ నుంచి 3 సార్లు, చిలిక నియోజ‌క‌వ‌ర్గం నుంచి 2 సార్లు ఈయ‌న ఎమ్మెల్యేగా ఎన్నిక‌య్యారు.

Read more RELATED
Recommended to you

Latest news