టీమిండియా విండీస్ టూర్‌కు 19న జట్టు ఎంపిక.. ధోనీ ఉంటాడా..?

533

ఆగస్టు 3వ తేదీ నుంచి టీమిండియా వెస్టిండీస్ పర్యటన ప్రారంభమవుతుంది. ఆ రోజున భారత్, వెస్టిండీస్‌తో తొలి టీ20 మ్యాచ్ ఆడుతుంది.

ఐసీసీ వరల్డ్ కప్ 2019 టోర్నీలో సెమీఫైనల్ మ్యాచ్‌లో న్యూజిలాండ్ చేతిలో దారుణ పరాజయం పాలయ్యాక టీమిండియా.. ఇంటా బయటా అందరిచే విమర్శలను ఎదుర్కొన్న విషయం విదితమే. కెప్టెన్ కోహ్లి, కోచ్ రవిశాస్త్రిలు తీసుకున్న అనాలోచిత నిర్ణయాల కారణంగానే టీమిండియా ఓడిపోయిందని మెజారిటీ అభిమానులు, మాజీ ప్లేయర్లు అభిప్రాయపడ్డారు. అయితే అది గతం.. పరాజయాల నుంచి పాఠాలు నేర్చుకుని వచ్చే వరల్డ్ కప్‌ను దృష్టిలో ఉంచుకుని.. ముందుకు సాగాల్సిన సమయమిది. ఈ క్రమంలోనే త్వరలో జరగనున్న విండీస్ టూర్ కోసం ఇప్పుడు టీమిండియా సిద్ధమవుతోంది.

ఆగస్టు 3వ తేదీ నుంచి టీమిండియా వెస్టిండీస్ పర్యటన ప్రారంభమవుతుంది. ఆ రోజున భారత్, వెస్టిండీస్‌తో తొలి టీ20 మ్యాచ్ ఆడుతుంది. ఈ క్రమంలో పర్యటన మొత్తం మీద భారత్ విండీస్‌తో మూడు టీ20 మ్యాచ్‌లు, మూడు వన్డేలు, 2 టెస్ట్ మ్యాచ్‌లను ఆడనుంది. అందుకు గాను ఈ నెల 19వ తేదీన భారత జట్టును విండీస్ పర్యటన కోసం ఖరారు చేయనున్నారు. ఈ క్రమంలో సెలక్టర్లు ముంబైలో సమావేశం నిర్వహించి భారత జట్టును ఎంపిక చేస్తారు.

అయితే టీమిండియా విండీస్ పర్యటన నేపథ్యంలో సెలక్టర్లు జట్టులోకి ఎవర్ని తీసుకుంటారు, ఎవరికి ఉద్వాసన పలుకుతారు అన్న విషయం ఆసక్తికరంగా మారింది. వరల్డ్‌కప్‌లో ఆటగాళ్ల ప్రదర్శనను బట్టే జట్టు ఎంపిక ఉంటుందని తెలుస్తున్నా.. కీలక ఆటగాళ్లయిన కోహ్లి, ధోనీ, బుమ్రాలకు ఈ సిరీస్ వరకు విశ్రాంతినివ్వవచ్చని తెలుస్తోంది. అయితే పలువురు మాజీలు మాత్రం ధోనీ రిటైర్మెంట్‌కు ఇదే సరైన సమయమని సూచిస్తున్నారు. ధోనీ తప్పుకుంటే కొత్త ఆటగాడికి అవకాశం లభిస్తుందంటున్నారు. అయితే వరల్డ్ కప్‌లో ధోనీ ప్రదర్శన మరీ అంతా బాగా ఏమీ లేదు. అలా అని చెప్పి ధోనీ మరీ చెత్తగా కూడా ఆడలేదు. ఓ మోస్తరు ఆట ఆడాడు. అయితే కొందరు మాత్రం ధోనీ ఇంకొన్నాళ్లు అంతర్జాతీయ క్రికెట్‌లో ఉంటే బాగుంటుందని అభిప్రాయపడుతున్నారు. అయితే ధోనీ సంగతి పక్కన పెడితే విండీస్ టూర్‌కు టీమిండియా కెప్టెన్‌గా రోహిత్ శర్మ ఎంపిక దాదాపుగా ఖాయమైందని ఇప్పటికే తెలుస్తోంది. మరి సెలెక్టర్లు ఏం చేస్తారో చూడాలి..!