వీ6 చానల్‌కు గుడ్‌బై చెప్పనున్న బిత్తిరిసత్తి..?

వీ6 న్యూస్ చానల్‌లో ఇకపై బిత్తిరి సత్తి తీన్మార్ వార్తల్లో కనిపించే అవకాశం లేనట్లు సమాచారం. ఆ చానల్‌తో సత్తి తెగదెంపులు చేసుకున్నాడని తెలుస్తోంది.

వీ6 న్యూస్ చానల్‌లో తీన్మార్ వార్తలు.. అంటే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది.. బిత్తిరి సత్తి, సావిత్రి.. తనదైన యాసతో, హావ భావాలతో, విన్యాసాలతో సత్తి టీవీ ప్రేక్షకులను ఎప్పటి నుంచో అలరిస్తూ వస్తున్నాడు.  అలాగే వార్త‌లు చ‌దివే యాంక‌ర్‌గా సావిత్రి తెలుగు ప్రేక్ష‌కుల కుటుంబాల్లో ఒక భాగ‌మైంది. ఒక రకంగా చెప్పాలంటే.. వీ6 చానల్ ప్రోగ్రామ్‌లకు రేటింగ్ రావడానికి కారణం.. బిత్తిరి సత్తి, సావిత్రిలే అని చెప్పవచ్చు. అయితే గ‌త కొద్ది రోజుల కింద‌ట సావిత్రి ఆ చాన‌ల్‌కు గుడ్‌బై చెప్ప‌గా.. ఇప్పుడు ఆమె బాట‌లోనే బిత్తిరి సత్తి కూడా ఆ చాన‌ల్‌కు రాజీనామా చేస్తున్న‌ట్లు తెలిసింది.

వీ6 న్యూస్ చానల్‌లో ఇకపై బిత్తిరి సత్తి తీన్మార్ వార్తల్లో కనిపించే అవకాశం లేనట్లు సమాచారం. ఆ చానల్‌తో సత్తి తెగదెంపులు చేసుకున్నాడని తెలుస్తోంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. సత్తి తెలంగాణలో మరో పాపులర్ చానల్ అయిన టీ న్యూస్‌తో తాజాగా ఒప్పందం చేసుకున్నాడని, అందుకనే ఇకపై వీ6లో సత్తి కనిపించడని వార్తలు వస్తున్నాయి.

టీ న్యూస్ ఇవ్వజూపిన భారీ ఆఫర్‌కు మొగ్గు చూపిన సత్తి వీ6 న్యూస్‌కు రిజైన్ చేసే పనిలో ఉన్నాడట. ఈ క్రమంలోనే రేపో మాపో ఆ విషయం కూడా బయటకు అధికారికంగా తెలుస్తుందని సమాచారం. వీ6 చానల్‌లో సాధారణంగా తీన్మార్ వార్తలకు ఎంత రేటింగ్ ఉంటుందో అందరికీ తెలిసిందే. కానీ ఇటీవల ఆ వార్తలకు వ్యాఖ్యాతగా వ్యవహరించే సావిత్రి దూరమైంది. ఈ క్రమంలో సత్తి ఉన్నప్పటికీ అవతలి వైపు వార్తలు చదివే కొత్త లేడీ యాంకర్‌ను జనాలు సావిత్రి స్థానంలో ఊహించుకోలేకపోతున్నారు. దీంతో తీన్మార్ వార్తల షోకు రేటింగ్స్ కూడా పెద్దగా ఏమీ రావడం లేదని తెలిసింది. ఈ క్రమంలో ఇప్పుడు బిత్తిరి సత్తి కూడా వీ6 కు గుడ్‌బై చెబితే ఇక తీన్మార్ వార్తలకు మరింత రేటింగ్ తగ్గే అవకాశం ఉంటుందని కూడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరి బిత్తిరి సత్తి వీ6కు రాజీనామా చేస్తాడా.. లేదా.. చూడాలి..!