హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు తమ అభ్యర్థుల జాబితాను ప్రకటించాయి. బీజేపీ 62 మంది అభ్యర్థులు, కాంగ్రెస్ 46 మంది అభ్యర్థులను ఖరారు చేసింది. సీఎం జైరాం ఠాకూర్.. సెరాజ్ నియోజకవర్గం నుంచి బరిలో నిలవగా సీనియర్ ఎమ్మెల్యే అనిల్ శర్మ మండి నుంచి సత్పాల్ సింగ్ సత్తి ఉనా నుంచి పోటీ చేస్తారు. బీజేపీ ఎనిమిది మంది ఎస్టీలకు టికెట్లు కేటాయించగా పలు చోట్ల సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్లు నిరాకరించింది.
మరోవైపు కాంగ్రెస్ 19 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు చోటు కల్పించింది. బంజార్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసిన ఆదిత్య విక్రం సింగ్‌కు టికెట్ దక్కకపోవడంతో ఆయన పార్టీకి రాజీనామా చేశారు. ఏడుగురు మాజీ మంత్రులు, ముగ్గురు మహిళలకు కాంగ్రెస్ జాబితాలో టికెట్లు లభించాయి.
మిగిలిన 22 అసెంబ్లీ స్ధానాలకు పోటీ చేసే అభ్యర్ధులను పార్టీ త్వరలో ఖరారు చేయనుంది. నవంబర్ 12న హిమాచల్ అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా డిసెంబర్ 8న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు ప్రకటిస్తారు.