ఆదిలాబాద్‌ కమలంలో పోరు..పట్టున్న స్థానాల్లో.!

-

తెలంగాణలో బీజేపీకి బాగా పట్టున్న స్థానాల్లో ఆదిలాబాద్ పార్లమెంట్ కూడా ఒకటి. ఇక్కడ పార్టీకి బలం ఉంది..కాస్త మహారాష్ట్రకు బోర్డర్ లో ఉండటంతో ఇక్కడ బి‌జే‌పి ప్రభావం ఎక్కువ ఉంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కొన్ని సీట్లలో బి‌జే‌పి రెండోస్థానంలో నిలిచింది. ఇక 2019 పార్లమెంట్ ఎన్నికల్లో ఏకంగా ఆదిలాబాద్ ఎంపీ సీటుని బి‌జే‌పి గెలుచుకుంది.అయితే 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలో ఉన్న ఏ ఒక్క సీటులో కూడా బి‌జే‌పి గెలవలేదు. కానీ 2019 పార్లమెంట్ ఎన్నికల్లో నాలుగు అసెంబ్లీ స్థానాల్లో బి‌జే‌పికి ఆధిక్యం వచ్చింది. ఆదిలాబాద్ పార్లమెంట్ లో 7 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఆసిఫాబాద్, ఆదిలాబాద్, బోథ్, ఖానాపూర్, ముధోల్, నిర్మల్, సిర్పూర్…ఈ ఏడు సీట్లలో ఆదిలాబాద్, బోథ్, నిర్మల్, ముధోల్ స్థానాల్లో బి‌జే‌పికి ఆధిక్యం రాగా, ఖానాపూర్ లో కాంగ్రెస్ పార్టీకి లీడ్ వచ్చింది.

ఇక సిర్పూర్, ఆసిఫాబాద్ లో మాత్రమే బి‌ఆర్‌ఎస్ పార్టీకి లీడ్ వచ్చింది.ఏ సీట్లలో లీడ్ వచ్చిందో..ఆ సీట్లలో ఈ సారి గెలవాలని బి‌జే‌పి చూస్తుంది. అయితే ఆ స్థానాల్లో బి‌జే‌పి బలంగానే ఉంది..నాయకుల మధ్య మాత్రం సఖ్యత లేదు.. ఎక్కడకక్కడ ఆధిపత్య పోరుకు దిగుతున్నారు. బీజేపీ బలంగా ఉన్న ముథోల్‌లో బీజేపీ జిల్లా మహిళా అధ్యక్షురాలు రమాదేవి, కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి వచ్చిన రామారావుపాటిల్, మోహన్‌రావు పాటిల్ మధ్య పోరు నడుస్తోంది. ఎవరికి వారు టికెట్ రేసులో ఉన్నారు.

 

నిర్మల్‌లో మున్సిపల్ మాజీ చైర్మన్ అప్పాల గణేష్, సీనియర్ నేత డాక్టర్‌ మల్లిఖార్జునరెడ్డి టికెట్ రేసులో ఉన్నారు. దాంతో.. ఎవరికి వారు సెపరేట్ గా కార్యక్రమాలు చేస్తూ అధిష్టానం మెప్పు కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఖానాపూర్ నియోజకవర్గంలో మాజీ ఎంపీ రమేష్ రాథోడ్, జడ్పీటీసీ జానుబాయి మధ్య పోరు నడుస్తోంది. బోథ్, ఆసిఫాబాద్ నియోజకవర్గాల్లోనూ అదే పరిస్థితి ఉంది. సిర్పూర్‌లో జిల్లా బీజేపీ అధ్యక్షుడు డాక్టర్‌ కొత్తపల్లి శ్రీనివాస్, సీనియర్ నేత పాల్వాయి హరీశ్‌బాబు మధ్య రచ్చ నడుస్తోంది. ఇలా పట్టున్న ఆదిలాబాద్ లో కమలనాథులు ఆధిపత్య పోరుకు దిగడం వల్ల పార్టీకి ఇంకా నష్టం జరిగేలా ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version