లేచినదగ్గరి నుంచి టీడీపీ నేతలకు ఏమాత్రం తగ్గకుండా ఏపీ సీఎం జగన్ పైనా, అతని పాలనపైనా విమర్శలు గుప్పిస్తుంటారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ! మిగిలిన ఒకవర్గం బీజేపీ నేతలు ఇందుకు ఏమాత్రం సహకరించకపోయినా.. బాబు అండదండలతోనో లేక మరేదైనా కారణంతోనో కానీ జగన్ పై రాష్ట్ర బీజేపీ తరుపున ఒంటరిపోరాటం చేస్తున్నారు! ఈ క్రమంలో జగన్ పాలన బాగాలేదు అని విమర్శలు గుప్పించే కన్నాకు కేంద్రంలోని బీజేపీ నేతల నుంచి గట్టి షాక్ తగిలింది!
కారణాలు ఏమైనా… జగన్ పై నిత్యం విమర్శలు చేసే రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడికి కేంద్రంలోని పాలిస్తున్న బీజేపీ అధిష్టానం షాకిచ్చింది. తాజాగా బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్.. సీఎం జగన్ ఏడాది పాలనను ప్రశంసించారు. రాష్ట్రంలో జగన్ – కేంద్రంలో మోడీ పాలన పగ్గాలు చేపట్టి ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా మాట్లాడిన రాంమాధవ్… మోడీకి జగన్ కు మధ్య సత్సంబంధాలు కొనసాగుతున్నాయని.. ఇద్దరూ ప్రజల కోసం పనిచేస్తున్నారని.. ఏపీ అభివృద్ధి పథంలో జగన్ ధృఢ సంకల్పంతో పనిచేస్తున్నారని ప్రశంసించారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు రాష్ట్ర బీజేపీ నేతలను అయోమయంలో పడేశాయనే చెప్పాలి!
ఇదే క్రమంలో మరింతగా ముందుకుపోయిన రాం మాదవ్… కేంద్రంలోని మోడీ ప్రభుత్వ నిర్ణయాలకు పార్లమెంట్ లో వైసీపీ ప్రధాన మద్దతు లభిస్తోందని.. దీన్ని మోడీ సర్కార్ స్వాగతిస్తోందని.. కేంద్రం కూడా ఏపీకి అన్ని రకాలుగా సాయం చేస్తుందని.. రాష్ట్ర విభజన చట్టంలోని అంశాలతోపాటు, వాటికి మించి ఏపీకి సహాయం చేసేందుకు సిద్దంగా ఉన్నామని ప్రధాని ఇప్పటికే చెప్పారని రాంమాధవ్ చెబుతున్నారు.
ఏది ఏమైనా… ఏపీ బీజేపీ నాయకులు జగన్ ఏడాది పాలన పట్ల తీవ్ర విమర్శలు చేస్తూ ఆడిపోసుకుంటున్న తరుణంలో.. స్వయంగా బీజేపీ జాతీయ నాయకత్వం మాత్రం జగన్ ఏడాది పాలనను కొనియాడడం రాష్ట్ర బీజేపీ నేతలకు మింగుడుపడని వ్యవహారమనే చెప్పాలి. మరి రాం మాదవ్ వ్యాఖ్యలపై రాష్ట్ర బీజేపీ నేతలు స్పందిస్తారా? లేక మౌనాన్నే తమ బాషగా చేసుకుని, వారి పని వారు చేసుకుంటారా అనేది వేచి చూడాలి! ఏది ఏమైనా… కేంద్రంలోని బీజేపీ నుంచి ఇది జగన్ కు వన్ ఇయర్ సెలబ్రేషన్స్ గిఫ్ట్ అనే చెప్పాలి!