మహాత్మాగాంధీ స్వాతంత్ర్య పోరాటం ఓ `డ్రామా` అంటున్న బీజేపీ ఎంపీ

-

జాతిపిత మహాత్మాగాంధీపై బీజేపీ ఎంపీ, మాజీ కేంద్రమంత్రి అనంత కుమార్  హెగ్డే తీవ్ర వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్ర‌స్తుతం ఈ వ్యాఖ్య‌లు దుమారం రేపుతున్నాయి. బెంగళూరులో శనివారం జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. గాంధీ స్వాతంత్ర్య పోరాటాన్ని ఓ డ్రామాగా అభివర్ణించారు. ఆయనను ‘మహాత్మా’ అని ఎందుకు పిలవాలని ప్రశ్నించారు. గాంధీ నడిపిన స్వాతంత్ర్య పోరాటం మొత్తం బ్రిటిషర్ల అనుమతితో, వారి ప్రోద్బలంతోనే సాగిందని ఆరోపించారు. వీరెవరికీ ఒక్క లాఠీదెబ్బ కూడా తగల్లేదన్నారు. గాంధీ నడిపిన స్వాతంత్ర్యోద్యమం నిజమైనది కాదని, బ్రిటషర్లతో కుమ్మక్కయి నడిపిన నాటకమని హెగ్డే తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

అదో సర్దుబాటు స్వాతంత్ర్య ఉద్యమమని ఆరోపించారు. అక్కడితో ఆగని హెగ్డే.. గాంధీ నిరాహార, సత్యాగ్రహ దీక్షలు కూడా నాటకమేనని తూలనాడారు. వాటివల్లే దేశానికి స్వాతంత్ర్యం వచ్చిందని కాంగ్రెస్ మద్దతుదారులు చెబుతున్నదాంట్లో ఇసుమంతైనా నిజం లేదన్నారు. బ్రిటిష్ వాళ్లకు భారతదేశంపై విసుగుపుట్టే వెళ్లిపోయారని కొత్త భాష్యం చెప్పారు. చరిత్ర చదువుతుంటే తన రక్తం మరిగిపోతుంటుందని, ఇలాంటి వాళ్లు మన దేశంలో మహాత్ములని గాంధీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. అయితే ప్ర‌స్తుతం ఈ వ్యాఖ్య‌లు తీవ్ర దూమారాన్ని రేపుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news