ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం మూటగట్టుకున్న భారతీయ జనతాపార్టీపై కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత చిదంబరం చలోక్తులు విసిరారు. బీజేపీ బుగ్గకు పంక్చరు పడిందని, ఇక దాని గాలిపోవడం ప్రారంభమైందని ఆయన చెప్పుకొచ్చారు. అంతేగాదు మత రాజకీయాలకు ఢిల్లీ ప్రజలు గట్టి బుద్దిచెప్పారన్నారాయన.
మంగళవారం సాయంత్రం పార్లమెంటు ఆవరణలో మాట్లాడిన చిదంబరం.. ‘భారతీయ జనతాపార్టీకి ఓడిపోవడానికి కావాల్సిన అన్ని అర్హతలు ఉన్నాయి. ఢిల్లీ ప్రజలు ఆ పార్టీకి సరైనరీతిలో బుద్ధిచెప్పారు. ఢిల్లీలో అన్ని రాష్ట్రాల ప్రజలుంటారు. అది భారతదేశానికి ప్రతిబింబం లాంటిది. ఢిల్లీ ఓటర్లు బీజేపీ బుగ్గ పంక్చయ్యేలా చేయడం మాకు చాలా సంతోషం కలిగించింది’ అని చమత్కరించారు.
మరి కాంగ్రెస్‌కు ఒక్క సీటు కూడా రాలేదుగా అన్న ప్రశ్నకు చిదంబరం తెలివిగా సమాధానమిచ్చారు. ఢిల్లీలో తమ పార్టీ కోల్పోయిందని, తాము అసలు పోటీలోనే లేమని, అందుకే మేము ఢిల్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామంటూ బీజేపీలా జబ్బలు చరుచుకోలేదని చెప్పారు. ఆశపడ్డ వాడికి ఆశాభంగం ఉంటుందిగానీ, అసలు ఆశే లేనివాడికి ఉంటుందా? అని చిదంబరం ప్రశ్నించారు.