ఇప్పుడు దేశ వ్యాప్తంగా కరోనా ఎంతలా వణికిస్తుందో.. గతకొన్ని రోజులుగా బ్లాక్ ఫంగస్ కూడా అదే స్థాయిలో భయపెడుతోంది. ఈ పేరు వింటేనే జనం గుండెల్లో దడ పుడుతోంది. అయితే ఈ బ్లాక్ ఫంగస్ పై ఎన్నో అనుమానాలు, మరెన్నో సందేహాలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు తాజాగా చికెన్ ద్వారా బ్లాక్ ఫంగస్ వస్తుందంటూ వార్తలు వినిపిస్తున్నాయి.
ఓ ప్రముఖ న్యూస్ వెబ్సైట్ పేరు మీద చికెన్ తింటే బ్లాక్ ఫంగస్ వస్తుందని వార్త పబ్లిష్ కావడంతో జనాలు నిలువుణా వణుకుతున్నారు. ఈ వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. గాలిలో ఉండే బ్లాక్ ఫంగస్.. కోళ్లకి కూడా వస్తుందని వాటిని తింటే మనుషులకు వస్తుందని పోస్టులు వెలుస్తున్నాయి.
అయితే వీటిపై ఐసీఎంఆర్ సీనియర్ సైంటిస్ట్ డాక్టర్ అపర్ణ ముఖర్జీ స్పందించారు. చికెన్ తింటే బ్లాక్ ఫంగస్ రాదని స్పష్టం చేశారు. బ్లాక్ ఫంగస్ అంటువ్యాధి కాదని, అలాంటప్పుడు జంతువులు, మనుషుల్లో ఒకరి ద్వారా మరొకరికి సోకుతుందన్న వాదనలో నిజం లేదని ఆమె తేల్చి చెప్పారు. కాబట్టి ఇలాంటి వార్తలు నమ్మొద్దని కోరారు. ఇక ఉల్లిగడ్డల మీద ఉండే నల్ల పొరల ద్వారా బ్లాక్ ఫంగస్ వస్తుందన్న వార్తలు కూడా అవాస్తవమని స్పష్టం చేశారు.