కరోనా వైరస్ నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలు ఎలాంటి తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కొంటున్నారో అందరికీ తెలిసిందే. దేశమంతా లాక్‌డౌన్ ఉండడంతో జనాలు బయటకు రావడం లేదు. బయటకు వస్తే ఏం జరుగుతుందో తెలుసు కాబట్టి.. జనాలు ఇండ్లలోనే ఉంటున్నారు. ఇక ప్రజలకు కావల్సిన అన్ని సహాయ సహకారాలను అందించడం కోసం ప్రభుత్వాలు ప్రయత్నాలు చేస్తున్నాయి. అలాగే కరోనా వల్ల ఉపాధి కోల్పోయిన వారికి, జీతాలు రాని వారికి ఊరట కలిగించేలా.. ఆర్‌బీఐ.. అన్ని లోన్లపై 3 నెలల వరకు మారటోరియం విధించింది. దీంతో 3 నెలల వరకు వేతన జీవులు, చిరు వ్యాపారులు తమ లోన్లకు ఈఎంఐలు కట్టాల్సిన పనిలేదు. అయితే ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు ప్రభుత్వాలు మరొక ఊరట కలిగించే విషయాన్ని చెప్పనున్నాయా.. అంటే.. అందుకు అవుననే సమాధానం వినిపిస్తోంది.
ఏపీ, తెలంగాణలలో వచ్చే 2 నెలల పాటు కరెంటు బిల్లులను రద్దు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ప్రభుత్వాలు ఈ విషయాన్ని ఇప్పటికే పరిశీలిస్తున్నట్లు తెలిసింది. 2, 3 రోజుల్లో ప్రభుత్వాలు విద్యుత్ శాఖల అధికారులతో సమావేశమై ఈ విషయంపై నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిసింది. ఇప్పటికే కేంద్రం పేద ప్రజల కోసం ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీని ప్రకటించగా.. ఆర్‌బీఐ మధ్య తరగతి వారికి ఊరట కలిగించేలా ఈఎంఐలపై మారటోరియం విధిస్తూ నిర్ణయం తీసుకుంది. అలాగే ఉపాధి హామీ కూలీని కూడా పెంచారు. ఈ క్రమంలోనే పేద, మధ్యతరగతి వర్గాలకు మరింత ఉపశమనం అందించేలా రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు విద్యుత్ బిల్లులను రద్దు చేయాలని నిర్ణయం తీసుకుంటాయని తెలుస్తోంది.
అయితే విద్యుత్ బిల్లులను రద్దు చేయడంపై రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు మార్గదర్శకాలు తయారు చేసి నిర్ణయం తీసుకుంటాయని తెలిసింది. రాబోయే 2 నెలల కాలంలో విద్యుత్ ఛార్జీలను తగ్గించాలా, లేక బిల్లులను పూర్తిగా రద్దు చేయడమా, లేదంటే బిల్లలును తరువాత వసూలు చేయడమా.. అన్న అంశాలను విద్యుత్ శాఖ అధికారులతో చర్చించి ప్రభుత్వాలు నిర్ణయం తీసుకుంటాయని సమాచారం. అయితే కేవలం తెల్ల రేషన్ కార్డులు ఉన్నవారికే ఈ వెసులు బాటు కల్పించేలా ప్రభుత్వాలు నిర్ణయం తీసుకుంటాయని తెలుస్తోంది. ఇక ఈ విషయంపై స్ఫష్టత రావాలంటే మరికొద్ది రోజులు వేచి చూడక తప్పదు..!