కరోనా వైరస్ దేశ వ్యాప్తంగా అత్యంత వేగంగా విస్తరిస్తుంది. ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. కరోనా వైరస్ ని ఏ విధంగా కట్టడి చెయ్యాలో అర్ధం కాక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పుడు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నాయి. కేంద్రం ఇటీవల 21 రోజుల పాటు దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించింది. ఈ లాక్ డౌన్ ని అందరూ కూడా కచ్చితంగా అమలు చెయ్యాలని కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా చెప్పింది.
దీనితో అత్యవసర సరుకులు మినహా ఏ ఒక్కటి కూడా ఇప్పుడు అందుబాటులో లేవు. అన్ని రాష్ట్రాలకు రవాణా సౌకర్యాలను కేంద్ర ప్రభుత్వం ఆపేసింది. రాష్ట్రాలు కూడా ఇతర ప్రాంతాల నుంచి ఎవరిని రానీయడం లేదు. ఈ తరుణంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా టోల్ ట్యాక్స్‌ను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్టు కేంద్ర రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించారు.
కొన్నాళ్ల పాటు టోల్ ఫీజును రద్దు చేస్తున్నామని ఆయన తెలిపారు. అత్యవసర సేవలు, సరుకు రవాణా కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు గడ్కరీ తెలిపారు. దేశ వ్యాప్తంగా అత్యవసర సర్వీసులు మినహా ఏ ఒక్క సర్వీసు కూడా తిరగడం లేదు. ప్రజల్లో కూడా ఇప్పుడు భయం ఉన్న నేపధ్యంలో ఎవరూ కూడా బయటకు వచ్చే ప్రయత్నం మాత్రం చేయడం లేదు. కేంద్రం తీసుకున్న నిర్ణయంపై పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.