రష్యా అధ్యక్షతన ఈసారి బిక్స్ (BRICS) సమావేశాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే ఆ దేశ అధ్యక్షుడు పుతిన్ ఆహ్వానం మేరకు ప్రధాని మోడీ నేడు రష్యాకు పయనం అయ్యారు. నేడు (మంగళవారం), రేపు (బుధవారం) 16వ బ్రిక్స్ సదస్సు జరగనుంది. ఈ క్రమంలోనే ప్రధాని మోడీ తెల్లవారుజామున రష్యాకు బయలుదేరారు. ఈ దఫా బ్రిక్స్ సదస్సు కజాన్ నగరంలో జరుగనుంది. ప్రపంచం ఎదుర్కొంటున్న కీలక సవాళ్లపై ఈ సదస్సులో అగ్రనేతలు చర్చించనున్నారు. అదేవిధంగా వాటి పరిష్కరానికి ఉమ్మడిగా సానుకూల నిర్ణయాలను తీసుకోనున్నారు.
ఇక బుధవారం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో ప్రధాని మోడీ ప్రత్యేకంగా భేటీ కానున్నారు. సదస్సు సందర్భంగా చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌తో పాటు ఇతర బ్రిక్స్ నేతలతో కూడా ప్రధాని మోడీ ద్వైపాక్షిక చర్చల్లో పాల్గొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ ద్వైపాక్షిక చర్చల్లో రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కొనసాగుతున్న ఆదోళనకర పరిస్థితులపై ఇరుదేశాల నేతలు ప్రత్యేకంగా చర్చించనున్నట్లు సమాచారం.