కొద్దిరోజుల్లో ఆమె వివాహం. కాబోయే పెళ్లికూతురు రాబోయే కొత్త జీవితంపై కలలు కంటూ.. సంసారం జీవితంపై అందమైన ఆశలు పెంచుకుంది. కానీ విధి ఆడిన వింతనాటకంలో ఆమె ప్రాణాలు కోల్పోయింది. కొద్దిరోజుల్లో పెళ్లి పీటలు ఎక‍్కాల్సిన ఓ యువతిని డెంగీ జ్వరం బలితీసుకుంది. చిత్తూరు జిల్లా పాలసముద్రం మండలంలోని నరసింహాపురం పంచాయతీ టీవీఎన్‌ఆర్‌పురం గ్రామానికి చెందిన కృష్ణంరాజు, రెడ్డెమ్మల కుమార్తె చంద్రకళ అలియాస్ కావ్య (18) గత నెల 30న పెళ్లి చేసేందుకు ఏర్పాట్లు చేశారు.
ఇంతలోనే ఆమెకు డెంగీ సోకింది. దాంతో ఆమెను చికిత్స నిమిత్తం తమిళనాడులోని షోళింగర్ ప్రభుత్వాసుపత్రికి, అక్కడినుంచి వేలూరులోని అడుకుంబారై ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరిస్థితి బాగా లేనందున వైద్యులు నిరాకరించడంతో పెళ్లి వాయిదా వేసుకున్నారు.ఇక శుక్రవారం ఆమె మృతి చెందడంతో రెండు కుటుంబాల్లో విషాదం నెలకొంది. పెళ్లి చేసి అత్తారింటికి పంపాల్సిన కుమార్తెను శ్మశానానికి పంపించాల్సి వచ్చిందంటూ మృతురాలి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు.