బ్రిటన్ ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్ కరోనా నుంచి కోలుకున్నారు. ఈ మేరకు ఆయన్ను హాస్పిటల్ నుంచి డిశ్చార్జి చేశారు. కరోనా లక్షణాలతో ఆయన సెంట్రల్ లండన్‌లోని సెయింట్ థామస్ హాస్పిటల్‌లో పరీక్షలు చేయించుకోగా.. ఆయనకు కరోనా పాజిటివ్ అని వచ్చింది. దీంతో ఆయనను హాస్పిటల్‌లో అడ్మిట్ చేసి చికిత్స అందించారు. అయితే 4 రోజుల కిందట ఆయన పరిస్థితి సీరియస్ కావడంతో ఆయన్ను ఐసీయూలో చేర్చి చికిత్స అందించారు. 3 రోజుల పాటు ఐసీయూలో ఉన్న ఆయన పరిస్థితి మెరుగు కావడంతో.. బోరిస్‌ను తిరిగి సాధారణ వార్డుకు చేర్చారు. ఇక ఇప్పుడు ఆయన కరోనా నుంచి కోలుకోవడంతో డిశ్చార్జి చేశారు.
కాగా పది రోజుల పాటు కరోనా చికిత్స తీసుకున్న బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ఆదివారం డిశ్చార్జి కావడంతో.. ఆయన్ను యూకేలోని బకింగ్‌హామ్‌షైర్‌లో ఉన్న ప్రధాని నివాసం చెకర్స్‌కు తరలించారు. అక్కడే ఆయన మరికొన్ని రోజుల పాటు క్వారంటైన్‌లో ఉండనున్నారు. కాగా తాను డిశ్చార్జి అయిన సందర్భంగా బోరిస్ జాన్సన్ మాట్లాడుతూ.. తనకు కరోనా చికిత్స అందించి.. సీరియస్ కండిషన్ నుంచి బయట పడేలా చేసి.. వ్యాధి నయం అయ్యేందుకు శ్రమించిన వైద్య సిబ్బందికి కృతజ్ఞతలు తెలుపుతున్నానని.. అన్నారు.
అయితే కరోనా తగ్గినా.. బోరిస్ జాన్సన్ ఇంకా రివకరీ అవుతున్నారని.. అందువల్ల ఆయన ఇప్పుడప్పుడే మళ్లీ ఆఫీస్‌కు వచ్చే అవకాశం లేదని.. ఓ అధికారి మీడియాకు తెలిపారు.