ఎన్డీయే ప్రభుత్వంలో రెండో విడత బడ్జెట్ ను ప్రవేశపెట్టేందుకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్ కు చేరుకున్న సంగతి తెలిసిందే. బడ్జెట్ ప్రతులతో ఆమె తొలుత క్యాబినెట్ సమావేశానికి హాజరయ్యారు. మోదీ నేతృత్వంలో సమావేశమైన కేంద్ర మంత్రివర్గం, బడ్జెట్ కు ఆమోదం తెలిపింది. ఆపై ఆమె లోక్ సభకు చేరుకున్నారు. ప్రస్తుతం నిర్మలాసీతారామన్ లోక్‌సభలో 2020-21 బడ్జెట్ ప్రవేశ పెడుతున్నారు. ఈ క్రమంలోనే దేశ ప్రజలకు ఈ బడ్జెట్‌తో ఆశించినంత ఉపాధి దొరుకుందని, వ్యాపారాలు వృద్ధి చెందుతాయని, మైనార్టీలకు, మహిళలకు, ఎస్సీఎస్టీల ఆశలను నెరవేర్చే విధంగా 2020 బడ్జెట్ ఉండబోతోందని నిర్మల చెప్పారు.
అలాగే పాలనా రంగంలో పూర్తి స్థాయి మార్పులు తెచ్చామని, సంస్కరణలు వేగవంతం చేసామని, ద్రవ్యోల్భణం అదుపు చేసామని, రాజకీయ స్థిరత్వంతో పాటు ఆర్ధిక పురోగతికి ఊతం ఇచ్చామని ఆమె తెలిపారు. మోదీ ప్రభుత్వానికి భారీ మెజార్టీ లభించిందని ఆమె గుర్తుచేశారు. చిత్తశుద్ధితో ప్రజలకు సేవ చేసేందుకు కట్టుబడి ఉన్నామని, ప్రజల ఆదాయాలను పెంచే దిశగా బడ్జెట్ ఉంటుందని.. సంపదను సృష్టించడమే లక్ష్యమని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు.