ఒక పత్రికాధిపతి వల్లే తెలుగుదేశం పార్టీ నాశనం అయిందని వైసీపీ నేత సి. రామచంద్రయ్య ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈమాట తాను అనడం లేదని.. వైసీపీ వాళ్లే అంటున్నారని అన్నారు. చంద్రబాబు ఓ మాఫియాను సృష్టించుకున్నారని… ఆ మాఫియా క్రియేషన్ కోసం ఎల్లో మీడియా ఉపయోగపడిందని ఆయన విమర్శించారు.
ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు అనుచరులు జర్నలిజం ముసుగు వేసుకుని రాష్ట్ర ప్రభుత్వానికి అడ్డుపడుతున్నారని రామచంద్రయ్య విరుచుకుపడ్డారు. ప్రభుత్వం చేసే ప్రతి పనిపైనా దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన అన్నారు. నాలుగు నెలల ప్రభుత్వంపై ఎల్లో మీడియా విషం కక్కుతోందని సీ రామచంద్రయ్య అన్నారు.
చంద్రబాబు ప్రభుత్వం 18మంది ఎర్ర చందనం కూలీలను చంపేస్తే ఆ సెక్షన్ మీడియా మాట్లాడిందా? గోదావరి పుష్కరాల్లో తొక‍్కిసలాట జరిగి అంతమంది చనిపోతే దానికి కారణం చంద్రబాబు అని ఆ మీడియాకు కనపడలేదా? పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై వార్తలు రాశారా? ఓటుకు నోటు కేసులో చంద్రబాబు తప్పు ఎత్తి చూపారా? రాష్ట్రం అప్పుల్లో ఉంటే చంద్రబాబు ముఖ్యమంత్రి హోదాలో ప్రయివేట్ విమానాల్లో తిరుగుతూ కోట్లు ఖర్చు పెట్టారు.
కాల్ మనీ కేసుల్లో ప్రాణాలు పోతుంటే ఎల్లో మీడియా స్పందించిందా? రాజధాని భూముల కొనుగోలులో ఇన్‌సైడర్ ట్రేడింగ్ జరిగింది అప్పుడు ఆ మీడియా రాసిందా? వారు కోరుకునే వ్యక్తి సీఎం అవడం కోసం ఎల్లో మీడియా జర్నలిజం హక్కులు మరిచిపోయింది. చంద్రబాబు రాజ్యం కోసం ఎల్లో మీడియా కృషి చేసిందని రామచంద్రయ్య విమర్శించారు.