చల్లని ఉదయం వేళ వేడి వేడిగా కాఫీ గొంతులోకి దిగుతుంటే వచ్చే మజాయే వేరు. చాలా మంది నిత్యం కాఫీ తాగనిదే ఏ పనీ చేయరు. అయితే కాఫీ తాగడం వల్ల పలు లాభాలు ఉన్నమాట వాస్తవమే అయినా.. దీన్ని తాగడం వల్ల డయాబెటిస్ ఉన్నవారికి ఏదైనా మేలు కలుగుతుందా ? కాఫీ రెగ్యులర్‌గా తాగితే షుగర్ అదుపులోకి వస్తుందా ? అంటే.. అందుకు సైంటిస్టులు సమాధానం చెబుతున్నారు.
కాఫీని రెగ్యులర్‌గా తాగడం వల్ల షుగర్ అదుపులోకి వస్తుంది. నిత్యం 3 నుంచి 4 కప్పుల వరకు కాఫీని సేవిస్తే టైప్ 2 డయాబెటిస్ వచ్చే అవకాశాలు 25 శాతం వరకు తగ్గుతాయి. అలాగే డయాబెటిస్ ఉన్న వారు కాఫీని తాగితే షుగర్ లెవల్స్ అదుపులోకి వచ్చేందుకు అవకాశం ఉంటుంది. ఈ విషయాన్ని సైంటిస్టులు తమ పరిశోధనల్లో వెల్లడించారు. కాఫీలో క్లోరోజెనిక్ యాసిడ్ (సీజీఏ) అనే పాలిఫినాల్ ఉంటుంది. ఇది యాంటీ ఆక్సిడెంట్ గుణాలను కలిగి ఉంటుంది. అందువల్ల శరీరంలో ఇన్‌క్రెటిన్స్ ఉత్పత్తి పెరుగుతుంది. ఇన్‌క్రెటిన్స్ శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తిని ప్రోత్సహిస్తాయి. దీని వల్ల ఇన్సులిన్ ఉత్పత్తి పెరిగి రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు తగ్గుతాయి. ఇలా కాఫీతో డయాబెటిస్ ఉన్నవారికి మేలే జరుగుతుంది.
అయితే డయాబెటిస్ ఉన్నవారు కాఫీ తాగడం మంచిదే అయినా అందులో పాలు, చక్కెర కలుపుకోకుండా తాగాలని సైంటిస్టులు సూచిస్తున్నారు. అలాగే హైబీపీ, నిద్రలేమి, గ్యాస్, అసిడిటీ సమస్యలు ఉన్నవారు కాఫీని కొద్ది మోతాదులో తీసుకోవాలని తెలిపారు. అందువల్ల డయాబెటిస్ ఉన్నవారు రెగ్యులర్‌గా కాఫీని తాగితే షుగర్ లెవల్స్‌ను అదుపులో ఉంచుకోవచ్చు.