వాంకిడి ఘటన మరువక ముందే మరో దారుణ ఘటన జరిగిందని.. ఇప్పటికైనా ప్రభుత్వం మొద్దు నిద్రను వీడదా..? అంటూ మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు పేర్కొన్నారు. పాఠశాలల్లో ఫుడ్ పాయిజన్ ఘటన పై ట్విట్టర్ వేదికగా స్పందించిన ఆయన.. ప్రభుత్వం పై ఫైర్ అయ్యారు. ఈ సందర్భంగా మంచిర్యాల ఘటన కు సంబంధించిన దృశ్యాలను పోస్ట్ చేశారు. దీనిపై వాంకిడి ఆశ్రమ పాఠశాలల్లో కలుషిత ఆహారం తిని 60 మంది విద్యార్థులు ఆసుపత్రి పాలైన ఘటన మరువక ముందే మంచిర్యాల గిరిజన ఆశ్రమ పాఠశాలలో మరో ఘటన చోటు చేసుకోవడం దారుణమని మండిపడ్డారు.
మంచిర్యాలలో 12 మంది విద్యార్థులు అస్వస్థతకు గురై ఆసుపత్రి పాలైన ఘటన బాధ కలిగిస్తున్నదని.. పదే పదే ఇలాంటి ఘటన జరుగుతున్నా ప్రభుత్వం మొద్దు నిద్ర వీడకపోవడం శోచనీయమన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న గురుకులాల్లో ఏం జరుగుతున్నదని.. విద్యార్థుల ప్రాణాలంటే ప్రభుత్వానికి పట్టింపు లేదా..? అని నిలదీశారు. చదువుకోవడానికి పాఠశాలలకు వెళ్తే ప్రాణాలు కోల్పోయే దౌర్భాగ్య పరిస్థితి రావడం అత్యంత హేయమన్నారు.