గంజాయి తో పాటు మాదక ద్రవ్యాల వినియోగం, సరఫరా పై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ ఉంది. ఇప్పటికే గంజాయి సాగు చేస్తే.. రైతు బంధు కట్ చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. అలాగే ప్రభుత్వ అధికారులు కూడా గంజాయి సాగును నిర్ములించడానికి చర్యలు చేపడుతున్నారు. అయితే ప్రభుత్వం సీరియస్ గా ప్రకటన చేసినా.. పట్టించుకోకుండా గంజాయి సాగు చేసిన రైతుకు ప్రభుత్వం షాక్ ఇచ్చింది. గంజాయి సాగు చేసిన రైతుకు రైతు బంధును నిలిపివేశారు. అంతే కాకుండా.. రైతు బంధు అర్హుల జాబితా నుంచి కూడా ఆ రైతు పేరును తొలగించారు.
కాగ ఈ వ్యవహారం బహబూబ్ నగర్ జిల్లాలో చోటు చేసుకుంది. జిల్లాలోని మణికొండ ప్రాంతంలో రాష్ట్ర అబ్కారీ, రెవెన్యూ శాఖల అధికారులు గతంలో తనిఖీ నిర్వహించారు. అక్కడ చంద్రయ్య అనే రైతు తన పొలంలో గంజాయి సాగు చేస్తు అధికారులకు చిక్కాడు. ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ వెంకట్ రావు దృష్టికి అధికారులు తీసుకెళ్లగా.. చంద్రయ్య కు వస్తున్న రైతు బంధును నిలిపి వేయాలని, అర్హుల జాబితా నుంచి తొలగించాలని అధికారులను ఆదేశించారు. దీంతో తెలంగాణ రాష్ట్రంలో మొదటి సారి గంజాయి సాగు చేస్తే.. రైతు బంధును కట్ చేశారు.