మోర్బీ కేబుల్ బ్రిడ్జి ఘటన.. వెలుగులోకి కీలక అంశాలు

-

గుజరాత్‌లోని మోర్బీ నగరంలో కేబుల్ బ్రిడ్జి ప్రమాద ఘటనలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అనుభవం లేని కంపెనీకి ఈ తీగల వంతెన మరమ్మతుల పనులు అప్పగించడం.. అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఈ పెను విషాదం జరిగిన సంగతి తెలిసిందే. ఈ బ్రిడ్జి మరమ్మతులు చేపట్టిన కాంట్రాక్టర్లకు ఆ పనిలో కనీస అర్హత లేదని తాజాగా ప్రాసిక్యూషన్‌.. మోర్బీ కోర్టుకు తెలిపింది.

ఈ వంతెన నిర్వహణకు శాశ్వత కాంట్రాక్టు కావాలని ఒరెవా గ్రూప్‌ గతంలో అధికారులను డిమాండ్‌ చేసింది. అందుకు వారు అంగీకరించకపోవడంతో అప్పటివరకు తాత్కాలిక మరమ్మతులు చేసి వంతెనను తెరుస్తామని గతంలో ఓసారి ఆ సంస్థ మోర్బీ జిల్లా కలెక్టర్‌కు లేఖ రాసిందట. అందుకు సంబంధించిన లేఖ ఒకటి తాజాగా బయటికొచ్చింది.

‘‘శాశ్వత కాంట్రాక్టు ఇవ్వనంతవరకు వంతెనకు తాత్కాలిక మరమ్మతు పనులు చేసి బ్రిడ్జిని తెరుస్తాం. అప్పటివరకు ఎలాంటి మెటీరియల్‌ను కూడా ఆర్డర్‌ చేయబోం. మా డిమాండ్లు నెరవేరితేనే వంతెన పనులను పూర్తిచేస్తాం. దీనిపై పునరాలోచన చేయండి’’ అని 2020లో ఒరెవా గ్రూప్‌ లేఖ రాసినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత 2022లో ఒరెవా కంపెనీ, మోర్బీ మున్సిపల్‌ కార్పొరేషన్‌ మధ్య వంతెన నిర్వహణకు ఒప్పందం జరిగింది. 15ఏ ళ్ల పాటు అంటే 2037 వరకు ఈ బ్రిడ్జి నిర్వహణ బాధ్యతలను అధికారులు ఆ కంపెనీకి అప్పగించారు.

అయితే ఈ మరమ్మతు పనులను కేవలం ఐదు నెలల్లోనే పూర్తిచేసి హడావుడిగా వంతెనను ప్రారంభించినట్లు తెలుస్తోంది. అధికారుల నుంచి ఎలాంటి సేఫ్టీ సర్టిఫికేట్లు తీసుకోకుండానే దీపావళి సమయంలో వంతెనను తిరిగి తెరిచారు. ఆ తర్వాత నాలుగు రోజులకే ఘోర విషాదం చోటుచేసుకుంది.

‘‘మరమ్మతుల సమయంలో వంతెన ఫ్లోరింగ్‌ను మార్చారు. కానీ తీగలను మార్చకుండా వదిలేశారు. కొత్తగా వేసిన ఫ్లోరింగ్‌ను నాలుగు లేయర్ల అల్యూమినియం షీట్లతో చేశారు. దీంతో పాత తీగలు ఈ బరువు మోయలేక తెగిపోయాయని ఫోరెన్సిక్‌ నివేదిక ద్వారా తెలిసింది.’’ అని ఈ ఘటనపై విచారణ జరపాలంటూ దాఖలైన పిటిషన్ పై మోర్బీ మేజిస్ట్రేట్‌ కోర్టు విచారణలో ప్రాసిక్యూటర్‌ హెచ్‌ఎస్‌ పంచాల్‌ కోర్టుకు వివరించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version