జనం కష్టాలు పట్టించుకోరు… నిపుణుల సూచనల్ని లెక్కచేయరు… కమిటీల నివేదికల్ని బుట్టదాఖలు చేస్తారు… ఇదీ మన పాలకుల తీరు. అందుకే గట్టిగా వర్షం పడితే భాగ్యనగరం చిగురుటాకుల వణికిపోతోంది. ఇప్పుడు కురుస్తున్న భారీ వర్షాలకు హైదరాబాద్‌లో 30 మంది ప్రాణాలు కోల్పోడానికి కూడా పాలకుల నిర్లక్ష్యమే కారణం.
వానంటే వాన కాదు.. థౌజండ్ హర్స్ పవర్ మోటారుతో నీళ్లు కొట్టినట్టే పడింది. సాధారణంగా పడే వర్షపాతం కంటే.. రెండు రోజుల్లో పడిన వర్షపాతం నాలుగు వందల శాతం ఎక్కువ. మూసీనది దిగువ ప్రాంతమంతా వరదలో చిక్కుకుంది. నగరంలో భారీ వర్షాలకు కొన్ని ఏరియాల్లో ఏదైనా ప్రాజెక్టు గేట్లు ఎత్తారా? అన్న రేంజ్‌లో ప్రవహించిన వరదలో… పెద్ద పెద్ద కార్లు కూడా… కాగితం పడవల్లా మారిపోయాయి. వరద ఉద్ధృతికి కొట్టుకుపోయాయి. ఒక చోట అయితే కారు మీద మరో కారు ఎక్కితే… ఆ రెండు కార్లను మరో కారు వచ్చి ఢీ కొట్టింది. మరో చోట ఇంకో కారు కూడా వరదలో కొట్టుకుపోయింది. ..?
కోటి మంది జనాభా ఉన్న రాజధానిలో నేటికీ నిజాం కాలంలో నిర్మించిన నాలాలే దిక్కు. కొన్ని చోట్ల అవి కూడా అక్రమణల వల్ల చిక్కిపోయాయి. నిజాం హాయంలో వంద అడుగుల వెడల్పుతో ప్రధాన నాలాలు నిర్మించగా… ప్రస్తుతం చాలా చోట్ల ఆక్రమణల వల్ల పది-ఇరవై అడుగులకు తగ్గిపోయాయి. డ్రైనేజీ వ్యవస్థ ఆధునికీకరణకు గాని, విస్తరణకు గాని ఎలాంటి చర్యలు చేపట్టలేదు పాలకులు. వందేళ్లలో రెండోసారి ఇటువంటి వరద బీభత్సం వచ్చిందని రికార్డులు చెబుతున్నాయి. ఇంతకీ వాన విలయాన్ని నగరం ఏమాత్రం తట్టుకోలేకపోయింది. ఏవీధి చూసినా నీటి ప్రవాహాలతోనే కనిపిస్తోంది. ఓల్డ్ సిటీ, సైబరాబాద్ అని లేకుండా అన్ని ప్రాంతాల్లో వరద విరుచుకుపడింది.
1908లో హైదరాబాద్ మొదటిసారి నగరం వరదల్లో చిక్కుకుంది. చాలా ప్రాంతాలు అతలాకుతలం అయ్యాయి. ఎక్కడిక్కడ నీళ్లు నిలిచిపోయాయి. నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ దీనికి పరిష్కారంగా ప్రభుత్వ చీఫ్ ఇంజనీర్ అలీ నవాజ్ జంగ్ బహదూర్, ప్రఖ్యాత ఇంజనీర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్యలకు సిటీలో సీవరేజీ నిర్మాణ బాధ్యతలను అప్పగించారు. 2000 సంవత్సరంలో కురిసిన భారీ వర్షానికి హుస్సేన్‌సాగర్ నాలా పరీవాహక ప్రాంతాల్లోని ఇళ్లు నీట మునిగాయ్. వరద ముంపును నియంత్రించేందుకు నాలాల విస్తరణ చేపట్టాలని అప్పుడే నిర్ణయించారు. ఇక, 2017లో వర్షాలు కురిసినప్పుడు రాత్రి వేళ స్వయంగా మంత్రులే రంగంలోకి దిగి పరిస్థితిని సమీక్షించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
అయితే, హైదరాబాద్‌కు ముంపు సమస్య నుంచి విముక్తి కల్పించేందుకు 2003లో నివేదిక అందించిన కిర్లోస్కర్ కమిటీ.. వరదనీరు సాఫీగా వెళ్లేందుకు నాలాలను అభివృద్ధి చేయాలని సూచించింది. అలాగే 2007లో గ్రేటర్ మొత్తానికీ సమస్య తీరేందుకు సమగ్ర మాస్టర్ ప్లాన్ రూపొందించారు. దాని ప్రాథమిక అంచనా మేరకు గ్రేటర్‌లో వరద నీటి సమస్య పరిష్కారానికి సుమారు 10వేల కోట్లు అవసరం. కానీ ఈ పనులన్నీ నిధుల లేమితో ముందుకు సాగడం లేదు. దీంతో చినుకు పడిందంటే చాలు… నరకం కనిపిస్తుంది. ఇక ఇలాంటి ఉపద్రవాలు వస్తే … నగరం చేతులెత్తేయాల్సిందే. భాగ్యనగరం కస్తా అభాగ్యనగరమై బోరుమంటుంది.
హైదరాబాద్‌లో నాలాల అభివృద్ధి, వర్షపు నీరు, మురుగు నీటి యాజమాన్యంపై రెండేళ్ల క్రితం JNTU నిపుణులు సమగ్ర నివేదిక ఇచ్చారు. నాలాలను విస్తరించడంతో పాటు వరదనీరు నగరంలోకి రాకుండా ఉండేందుకు కొన్నిచోట్ల కృత్రిమ చెరువులను తవ్వాలని సూచించారు నిపుణులు. అయితే, దీనికి 4 వేల 900 కోట్ల రూపాయల ఖర్చవుతుందని అంచనా వేశారు.
హైదరాబాద్ అభివృద్ధికి వేలకోట్ల రూపాయలు ఏ సర్కార్ అధికారంలో ఉన్నా ఖర్చు చేస్తున్నాయ్. కానీ, ఆ నిధులు ఎక్కువ భాగం ఖర్చు చేసేది సుందరీకరణకు మాత్రమే. డ్రైన్ల పై శ్రద్ధ పెట్టి ఎప్పటికప్పుడు సిల్ట్ క్లిన్ చేయడం వంటి కార్యక్రమాలను జీహెచ్‌ఎంసీ ప్రణాళికా బద్దంగా చేపట్టడం లేదన్నది తాజా ఉపద్రవం రుజువు చేసింది. భాగ్యనగరం విశ్వ నగరం అంటూ ప్రచారం చేసుకోవడమే కానీ.. భారీ వర్షాలు సంభవిస్తే సిటీ హుస్సేన్ సాగర్ అయిపోతుందన్న చేదు నిజం ఇప్పుడిప్పుడే ప్రజలకు అర్ధమవుతోంది.