సామ్‌సంగ్ ప్రతిష్టాత్మక నోట్ 2019 ఫోన్, ‘గెలాక్సీ నోట్ 10’ , హైదరాబాద్ గెలాక్సీప్రియుల చేతికి అందింది. పంజాగుట్టలోని సమీర్ కమ్యూనికేషన్స్‌లో సామ్‌సంగ్ దక్షిణాసియా విభాగాధిపతి ఎస్‌బి కిమ్ చేతుల మీదుగా ప్రిబుక్ కస్టమర్లకు ఫోన్‌ను అందజేసారు.
హైదరాబాద్ గెలాక్సీ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న ‘నోట్ 10’ ఫాబ్లెట్ ఈరోజు ఉదయం వారి చెంతకు చేరింది. నగరంలోని పంజాగుట్ట సమీర్ కమ్యూనికేషన్స్‌లో ఈ వేడుక జరిగింది. ముఖ్య అతిథిగా విచ్చేసిన సామ్‌సంగ్ దక్షిణాసియా విభాగాధిపతి ఎస్‌బి కిమ్, ప్రిబుక్ చేసుకున్న వినియోగదారులకు ఫోన్లను అందజేసారు. షోరూమ్ అధినేత సమీర్ మొహమ్మద్, కిమ్‌కు సాదరంగా స్వాగతం పలికి, తమ ముఖ్యమైన కస్టమర్లను ఆయనకు పరిచయం చేసారు.
తొలినుంచీ సామ్‌సంగ్ ఫోన్ల విక్రయంలో అగ్రభాగాన ఉన్న సమీర్ కమ్యూనికేషన్స్‌ను సందర్శించాలని తనకు ఎప్పట్నుంచో ఉందని, హైదరాబాద్ లో నోట్ 10 విడుదల చేయడం తనకు గర్వకారణమని కిమ్ తెలిపారు. భారత్ సామ్‌సంగ్‌కు ప్రియమైన దేశమని చెప్పిన కిమ్, ఇక్కడ తమకు ఎన్నో కార్యాలయాలున్నాయని, తమకు ఎంతో ప్రతిష్టాత్మకమైన పరిశోధన, అభివృద్ధి కేంద్రం కూడా బెంగుళూరులోనే ఉందన్నారు.
నోట్10 పూర్తిగా భారత్‌లోనే తయారైందని, నోట్ 10 సాఫ్ట్‌వేర్ రూపకల్పనలో కూడా భారత భాగస్వామ్యం మొదలైందని తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ‘మేకిన్ ఇండియా’ కాన్సెప్ట్‌తో తాము ఇక్కడ తయారుచేసిన ఫోన్లను ప్రపంచమంతా ఎగుమతి చేస్తున్నామని కిమ్ తెలిపారు. బెంగుళూరు పరిశోధనాకేంద్రం నుంచి వెలువడిన సాఫ్ట్‌వేర్ మాడ్యూల్స్‌ను మొదటిసారిగా నోట్ 10లో వాడామని, భారతీయ ఇంజనీర్లు అద్భుత ప్రతిభ కలిగినవారని కిమ్ కొనియాడారు. మున్ముందు తమ పరిశోధనాకేంద్రం నుండి అద్భుతాలు జరుగనున్నాయన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేసారు.