నేటి ఆధునిక యుగంలో ప్రతి ఒక్కరి దైనందిన జీవితంలో స్మార్ట్‌ఫోన్ ఒక భాగమైపోయింది. నేటి తరుణంలో సెల్‌ఫోన్ లేని వారు అంటూ ఎవరూ ఉండరు అంటే అతిశయోక్తి కాదు. అయితే స్మార్ట్‌ఫోన్లతో ఎన్ని లాభాలు ఉన్నాయో అన్నే నష్టాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా పలువురు మృగాళ్లు ఫోన్లలో యువతులు, మహిళల వీడియోలు, ఫొటోలను తీసి వారిని బ్లాక్ మెయిల్ చేయడం, లేదంటే నెట్‌లో ఆ చిత్రాలను ఉంచడం చేస్తున్నారు. దీంతోపాటు స్మార్ట్‌ఫోన్ల కారణంగా కాలేజీల్లో యువత పెడదారి పడుతుందనే వాదనలు వినిపిస్తున్నాయి.
స్మార్ట్ ఫోన్ల వల్ల యువత శ్రుతి మించి వ్యవహరిస్తున్నదంటూ తమిళనాడు విద్యాశాఖకు యువతులు, విద్యార్థినుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే ఆ రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకపై తమిళనాడులో ప్రభుత్వ, ప్రభుత్వ సహకారంతో నడిచే విద్యాసంస్థల్లో సెల్‌ఫోన్లను నిషేధించారు. విద్యార్థులు ఎట్టి పరిస్థితుల్లోనూ కళాశాలలు, వాటి ప్రాంగణాల్లోకి సెల్‌ఫోన్లను తీసుకురాకూడదు.
తమిళనాడులో ఇప్పటికే అనేక ప్రైవేటు కళాశాలల్లో విద్యార్థులకు డ్రెస్ కోడ్ అమలులో ఉంది. అయితే దీన్ని అమలు చేయడంలో అనేక కాలేజీలు విఫలమవుతున్నాయి. ఈ క్రమంలో ప్రస్తుతం ఆ రాష్ట్రంలో ఇకపై ప్రభుత్వ, ప్రభుత్వ సహకారంతో నడిచే కళాశాలల్లో సెల్‌ఫోన్లను నిషేధించారు కనుక ఈ నిషేధం కూడా అమలులోకి వచ్చింది. కానీ దీన్ని ఎంత మేర అమలు చేస్తారో వేచి చూస్తే తెలుస్తుంది.