కేరళా… సైకిలా…..

-

భారీ వ‌ర్షాలు, వ‌ర‌ద‌ల కార‌ణంగా తీవ్ర ఇబ్బందులు ప‌డుతున్న కేర‌ళ వాసుల‌ను ఆదుకునేందుకు దేశ వ్యాప్తంగా అనేక మంది ముందుకు వస్తున్నారు. సెల‌బ్రిటీలు, రాజ‌కీయ నాయ‌కులు, సామాన్య పౌరులు అనేక మంది కేర‌ళ వాసుల‌కు విరాళాల‌ను అంద‌జేస్తున్నారు. కాగా తాజాగా త‌మిళ‌నాడుకు చెందిన ఓ 9 ఏళ్ల బాలిక కూడా కేర‌ళ వాసుల‌ను ఆదుకోవాలంటూ త‌న వంతు స‌హాయం చేసింది. తాను సైకిల్ కొనుక్కునేందుకు గాను ఎంతో కాలంగా దాచుకున్న డ‌బ్బును కేర‌ళ వాసుల కోసం ఇచ్చేసి దాతృత్వాన్ని చాటుకుంది.

తమిళనాడులోని విల్లుపురం ప్రాంతానికి చెందిన తొమ్మిదేళ్ల అనుప్రియ తాను దాచుకున్న రూ. 9వేలను కేరళ సీఎం సహాయనిధికి విరాళంగా ఇచ్చింది. ఈ డబ్బులను సైకిల్‌ కొనుక్కునేందుకు గత నాలుగేళ్లుగా నేను దాచుకున్నాను. కానీ కేరళ వరదల గురించి టీవీల్లో చూసిన తర్వాత ఆ డబ్బులను వారికి ఇచ్చేయాలని నిర్ణయించుకున్నా.. అని అనుప్రియ చెబుతోంది. కాగా ఈ వార్త స్థానిక మీడియాలో ప్రసారం కాగానే ఆమెపై ప్రశంసలు వెల్లువెత్తాయి. అంద‌రూ ఆమె దాతృత్వాన్ని అభినందిస్తున్నారు.

ఇక అనుప్రియ గురించి తెలుసుకున్న హీరో సైకిల్స్‌ యాజమాన్యం ఆమెను ప్రశంసించింది. చిన్నారికి సైకిల్‌ను బహుమతిగా ఇవ్వనున్నట్లు ప్రకటించింది. డియర్‌ అనుప్రియ.. అవసరాల్లో ఉన్నవారి పట్ల నువ్వు చూపించిన మానవత్వం చాలా గొప్పది. మా నుంచి నీకో సైకిల్‌ బహుమతిగా వస్తుంది.. అని హీరో సైకిల్స్‌ ట్విటర్‌ ఖాతాలో పేర్కొంది. అదేవిధంగా హీరో మోటార్‌ కంపెనీ ఛైర్మన్‌, ఎండీ పంకజ్‌ ముంజల్‌ కూడా ఆ చిన్నారిని ప్రశంసించారు. ఏది ఏమైనా ఆ బాలిక అంత గొప్ప‌గా మాన‌వ‌త్వాన్ని చాటుకుందంటే అది మామూలు విష‌యం కాదు. అందుకు అంద‌రం ఆమెను అభినందించాల్సిందే..!

Read more RELATED
Recommended to you

Exit mobile version