కరోనా వ్యాక్సిన్ మరికొద్ది రోజుల్లో అందుబాటులోకి రానున్న నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే వ్యాక్సిన్ పంపిణీకి ఏర్పాట్లు చేశాయి. అందులో భాగంగానే మొదటి దశలో 30 కోట్ల మందికి వ్యాక్సిన్ వేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అందులో వైద్య, ఆరోగ్య సిబ్బంది, పోలీసులు, ఆర్మీ తదితర అత్యవసర సేవలను అందించే విభాగాలకు చెందిన ఉద్యోగులతోపాటు 50 ఏళ్లు పైబడిన వృద్ధులు ఉంటారు. అలాగే 50 ఏళ్ల కన్నా తక్కువ వయస్సు ఉండి, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవారికి కూడా మొదటి దశలో వ్యాక్సిన్ ఇస్తారు. మొత్తం రెండు డోసులను వారికి ఇవ్వనున్నారు.
కాగా కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీకి గాను కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు పలు మార్గదర్శకాలను విడుదల చేసింది. అవేమిటంటే…
* వ్యాక్సిన్ ను ఒక రోజుకు లేదా ఒక సెషన్‌కు 100 మందికి ఇస్తారు. ఆరోగ్య సిబ్బంది, ఫ్రంట్ లైన్ వర్కర్లు, 50 ఏళ్లు పైబడిన వారు, 50 ఏళ్ల లోపు ఉంటే దీర్ఘకాలిక అనారోగ్యాలు ఉన్నవారికి ముందుగా వ్యాక్సిన్ ఇస్తారు. ఆ తరువాత సాధారణ ప్రజలకు వ్యాక్సిన్‌ను పంపిణీ చేస్తారు. 50 ఏళ్లకు పైబడిన వారిని మళ్లీ రెండు గ్రూపులుగా విభజించి వ్యాక్సిన్ ఇస్తారు. 50 నుంచి 60 ఏళ్ల మధ్య వారు, 60 ఏళ్లకు పైబడిన వారు.. ఇలా 2 గ్రూపులుగా విభజించి వ్యాక్సిన్‌ను పంపిణీ చేస్తారు.
* కేంద్ర ఎన్నికల సంఘం తాజాగా ప్రకటించిన ఓటరు జాబితాను అనుసరించి 50 ఏళ్లకు పైబడిన వారిని గుర్తిస్తారు.
* హెల్త్‌కేర్, ఫ్రంట్ లైన్ వర్కర్లకు ఫిక్స్‌డ్ సెషన్ కేంద్రాల్లో వ్యాక్సిను ఇస్తారు. హై రిస్క్ ఉన్నవారికి సెషన్ సైట్స్ లేదా మొబైల్ సైట్స్ లేదా బృందాలుగా మారి టీకా ఇస్తారు. రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు వ్యాక్సిన్‌ను ప్రజలకు ఏయే తేదీల్లో ఇచ్చేది, ఎక్కడ ఇచ్చేది.. స్పష్టంగా తెలియపరచాలి.
* వ్యాక్సిన్ తీసుకునేందుకు ముందుగా దరఖాస్తు చేసుకోవాలి. అందులో ఉన్నవారికి స్లాట్లను బట్టి వ్యాక్సిన్‌ను ఇస్తారు. ఈ ప్రక్రియకు కేంద్రం కొత్తగా ఒక వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తేనుంది.
* కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీకి సిబ్బందికి శిక్షణ ఇస్తారు. వ్యాక్సిన్ ఇచ్చే బృందంలో 5 మంది ఉంటారు. ఒక డాక్టర్ (ఎంబీబీఎస్ లేదా బీడీఎస్), స్టాఫ్ నర్స్, ఫార్మసిస్టు, సహాయక నర్సు (ఏఎన్ఎం), లేడీ హెల్త్ విజిటర్ ఉంటారు. అయితే ఇంజెక్షన్ వేసేందుకు చట్టబద్దంగా అర్హత ఉన్న ఎవరినైనా ఈ ప్రక్రియ కోసం ఎంపిక చేయవచ్చు.
* పోలీసు, హోం గార్డు, సివిల్ డిఫెన్స్, నేషనల్ క్యాడెట్ కార్ప్స్, నేషనల్ సర్వీస్ స్కీం లేదా నెహ్రూ యువ కేంద్ర సంఘటన్ ల నుంచి ఒక్కొక్కరితోపాటు ఒక వ్యాక్సినేషన్ ఆఫీసర్ ఉంటారు. వీరు లబ్ధిదారుల రిజిస్ట్రేషన్ స్టేటస్‌ను ఎంట్రీ పాయింట్ వద్ద చెక్ చేసి తరువాతే వారిని లోపలికి వ్యాక్సిన్ కోసం పంపిస్తారు.
* లోపల మరొక వ్యాక్సినేషన్ ఆఫీసర్ వివరాలను వెరిఫై చేసుకుంటారు. తరువాత ఇంకో ఇద్దరు వ్యాక్సినేషన్ ఆఫీసర్లు, సపోర్ట్ స్టాఫ్, ఇతర సిబ్బంది వ్యాక్సిన్ వేస్తారు. అలాగే వారు వ్యాక్సిన్‌పై లబ్ధిదారులకు అవగాహన కల్పిస్తారు.
* కోవిడ్ వ్యాక్సిన్ కోసం ఎంత మంది రిజిస్టర్ చేసుకున్నారు, ఎంత మందికి ఇచ్చారు.. వంటి వివరాలను రియల్‌టైమ్‌లో తెలుసుకునేందుకు కోవిడ్ 19 వ్యాక్సిన్ ఇంటెలిజెన్స్ నెట్‌వర్క్ (కో-విన్) సిస్టమ్‌ను ప్రత్యేకంగా అందుబాటులోకి తెస్తారు.
* అడ్వర్స్ ఈవెంట్ ఫాలోయింగ్ ఇమ్యునైజేషన్ సర్వేలెన్స్ వ్యవస్థ ద్వారా కోవిడ్ టీకా తీసుకున్న వారిని నిరంతరం పర్యవేక్షిస్తారు. ఎలాంటి దుష్పరిణామాలు చోటు చేసుకోకుండా ప్రజా భద్రతకు ప్రాధాన్యతను ఇస్తూ వారు కోవిడ్ టీకా తీసుకున్న వారిని పర్యవేక్షిస్తుంటారు.