కేసీఆర్ 2.0..మెరుపులేంటి ?..మరకలేంటి ?

-

తెలంగాణ సీఎంగా కేసీఆర్‌ రెండోసారి ప్రమాణస్వీకారం చేసి నేటికి సరిగ్గా రెండేళ్లు. ముందస్తు ఎన్నికలతో మరో విజయాన్ని అందుకున్న కేసీఆర్‌ రెండోసారి ముఖ్యమంత్రి అయ్యారు. సెకండ్ టర్మ్‌లో కాళేశ్వరం ప్రారంభం… రైతుబంధు పంటసాయం పెంచడం.. రెవిన్యూ, మున్సిపల్ సంస్కరణలు, కొత్త సచివాలయ నిర్మాణం వంటి కార్యక్రమాలు చేపట్టారు. మరోవైపు ఏ ఎన్నికలైనా విజయాలతో దూసుకుపోయిన కారు జోరుకు.. దుబ్బాక, గ్రేటర్ హైదరాబాద్‌ ఎన్నికలు బ్రేకులు వేశాయి.

తెలంగాణలో టీఆర్‌ఎస్‌ వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తవుతున్నాయి. ఆరునెలల పదవీకాలం ఉండగానే అసెంబ్లీని రద్దుచేసి కేసీఆర్‌ ముందస్తు ఎన్నికలకు వెళ్లి విజయం సాధించారు. ఆ ఎన్నికల ఫలితాలు 2018 డిసెంబరు 11న వెలువడగా 13న కేసీఆర్‌ రెండోసారి సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల జోరును ఆ తర్వాత జరిగిన మున్సిపల్, పరిషత్తు ఎన్నికల్లోనూ కొనసాగించారు.

తెలంగాణ ఉద్యమ సారథిగా ఉండి.. రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ తొలి టర్మ్‌లో… కీలక నిర్ణయాలతో ప్రజలను ఆకట్టుకున్నారు. రాష్ట్రానికి ఎటువంటి పథకాలు, సంస్కరణలు అవసరమో వాటిపై ప్రత్యేక దృష్టి సారించి ముందుకు నడిపించారు. ముఖ్యంగా విద్యుత్ విషయంలో ఉన్న అనుమానలన్నింటినీ పటాపంచలు చేశారు. ఉద్యమంలో కీలకమైన నీళ్లు, నిధులు, నియామకాలకు ప్రాధాన్యం ఇచ్చారు. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ వంటి కార్యక్రమాలు చేపట్టారు. రెండో టర్మ్‌లోనూ వాటిని కొనసాగిస్తూ ముందుకు సాగుతున్నారు. రెండో టర్మ్‌లో కాళేశ్వరం ప్రాజెక్ట్‌ను ప్రారంభించారు. ఈ ప్రాజెక్ట్ నిర్మాణంతో రాష్ట్రం 80 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతోందని ప్రభుత్వం చెబుతోంది. మూడు మీటర్ల మేర భూగర్భ జలాలు పెరిగాయని ప్రభుత్వ గణంకాలు చెబుతున్నాయి.

రెండోసారి అధికారంలోకి వస్తే.. మరోసారి లక్షరూపాయల రుణమాఫీ అమలు చేస్తామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు. లక్ష రూపాయలలోపు ఉన్న రుణాల్లో ముందుగా 25వేల రూపాయలలోపు బాకీలకు రుణమాఫీ అమలు చేశారు. పంటల సాగుకు నియంత్రిత పద్ధతి అమలు చేస్తున్నారు. ఏ నేలకు ఎటువంటి పంట అవసరమో ప్రభుత్వమే సూచిస్తోంది. గతేడాది 1.12 కోట్ల మెట్రిక్ ట్నుల ధాన్యాన్ని సేకరించి.. రికార్డ్ సృష్టించింది. దేశంలోని ధాన్యం ఉత్పత్తిలో 63శాతం తెలంగాణ నుంచే ఉత్పత్తి అయ్యిందని ప్రభుత్వం తెలిపింది. ఇక రెవెన్యూ, మున్సిపల్ సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. భూముల రిజిస్ట్రేషన్ బాధ్యతలను తహసీల్దార్లకే అప్పగించారు. ధరణి వెబ్ సైట్ ప్రారంభించారు.

రెండో టర్మ్‌లో ముఖ్యంగా సచివాలయ నిర్మాణానికి సీఎం కేసీఆర్ పూనుకున్నారు. పాత సెక్రటేరియట్‌ను కూల్చివేసి… అదే స్థలంలో నూతన భవన సముదాయాన్ని నిర్మిస్తున్నారు. కొత్త సచివాలయానికి గతేడాది జూన్‌ 27న శంకుస్థాపన చేశారు. హైదరాబాద్‌లో అనేక కార్యక్రమాలు చేపట్టారు. దుర్గంచెరువు కేబుల్ బ్రిడ్జీ ప్రారంభించారు. 9 ప్లైఓవర్లు, 4అండర్‌పాస్‌లు , 3 ఆర్వోబీలు ప్రారంభించారు. కరోనాను సమర్థంగా ఎదుర్కోగలిగారు.

కేసీఆర్ సర్కార్‌ జోరుకు కరోనా వల్ల ఆర్థిక ఇబ్బందులు తలెత్తాయి. ఆదాయం విషయంలో ప్రభుత్వ అంచనాలు తలకిందులయ్యాయి. ఆర్థికంగా టీఆర్‌ఎస్‌ సర్కారుకు సవాళ్లు ఎదురవుతూనే ఉన్నాయి. అప్పులతోనే నెట్టుకు రావాల్సిన పరిస్థితి ఉంది. ఇప్పుడిప్పుడే ఆర్థిక పరిస్థితి కొద్దిగా గాడిన పడుతున్నా.. ఖజానాకు ఉపశమనం మాత్రం లభించడం లేదు. ఇక రాజకీయంగా ఇన్నాళ్లు దూకుడుగా సాగిన టీఆర్‌ఎస్‌కు దుబ్బాక ఉపఎన్నికల్లో ఓటమితో తొలి ఎదురుదెబ్బ తగిలింది. హుజూర్‌నగర్ ఉపఎన్నికల్లో విజయం సాధించిన టీఆర్‌ఎస్… దుబ్బాకలో మాత్రం ఓటమిపాలవ్వక తప్పలేదు. ఆతర్వాత జరిగిన గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో అనుకున్న స్థాయిలో ఫలితాలను సాధించలేకపోయింది. సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించినప్పటికీ, గతంతో పోలిస్తే భారీగా స్థానాలను కోల్పోయింది.

ఆరున్నరేళ్లు అప్రతిహతంగా సాగిన కేసీఆర్ సర్కార్‌కు ఇకపై పూలబాట కాదని, రాబోయే మూడేళ్లూ ముళ్లదారిలో పయనించక తప్పదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సర్కార్ పాలనకు ముందు ముందు మరిన్ని సవాళ్లు ఉన్నాయనే వాదన వినిపిస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news