కరోనా నేపథ్యంలో ప్రస్తుతం దేశంలో చాలా మంది తీవ్రమైన మానసిక సమస్యలతో సతమతమవుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే అలాంటి వారికి సహాయం చేయడం కోసం కేంద్రం కొత్తగా 1800-599-0019 పేరిట ఓ నూతన టోల్ ఫ్రీ నంబర్‌ను అందుబాటులోకి తెచ్చింది. దీన్ని కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత శాఖ మంత్రి తావర్‌చంద్ గెహ్లాట్ ప్రారంభించారు.
కేంద్రం అందుబాటులోకి తెచ్చిన ఈ హెల్ప్‌లైన్ నంబర్ రోజుకు 24 గంటలూ పనిచేస్తుంది. దేశంలో ఏ మూలన ఉన్నవారైనా ఈ నంబర్ కాల్ చేసి తమకు ఎదురవుతున్న మానసిక సమస్యలకు పరిష్కారం పొందవచ్చు. అందుకు గాను దేశవ్యాప్తంగా 660 మంది సైకాలజిస్టులు, 668 మంది సైకియాట్రిస్టులు ఎప్పుడూ అందుబాటులో ఉంటారు. ఇక బాధితులు ఈ నంబర్‌కు కాల్ చేస్తే ముందుగా భాషను ఎంచుకోవాలి. మొత్తం 13 భాషల్లో ఈ సేవలను అందిస్తున్నారు. హిందీ, అస్సామీస్, తమిళం, మరాఠీ, ఒడియా, తెలుగు, మళయాళం, గుజరాతీ, పంజాబీ, కన్నడ, బెంగాలీ, ఉర్దూ, ఇంగ్లిష్‌లలో ప్రజలు సైకియాట్రిస్టులు, సైకాలజిస్టులతో మాట్లాడి తమ మానసిక సమస్యలను పరిష్కరించుకోవచ్చు.
బాధితులు ఈ నంబర్‌కు కాల్ చేసి తమకు కలిగే ఎలాంటి మానసిక సమస్యకు అయినా సరే పరిష్కారం పొందవచ్చు. సేవలను ఉచితంగా అందిస్తారు. ఆందోళన, ఓసీడీ, సూసైడ్ చేసుకోవాలనే భావనలు కలగడం, డిప్రెషన్, పానిక్ అటాక్స్, పోస్ట్ ట్రమాటిక్ స్ట్రెస్ తదితర అన్ని మానసిక సమస్యలకు ఈ నంబర్ ద్వారా పరిష్కారం పొందవచ్చు.