అటు నాని ఇటు వంశీ ! ఎడాపెడా వాయించేస్తున్నారే ?

-

ముందు చూస్తే నువ్వు వెనక్కి చూస్తే గొయ్యి అన్నట్లు తయారైంది టిడిపి అధినేత చంద్రబాబు పరిస్థితి. రాజకీయ ఉద్దండుడిగా పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్న చంద్రబాబు ఇప్పుడు గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. అందరూ ఎడాపెడా విమర్శలతో ఊపిరి సలపకుండా చేసేస్తున్నారు. ముఖ్యంగా ఏపీ మంత్రి కొడాలి నాని చంద్రబాబుపై చేసే విమర్శలు తట్టుకోవడం చాలా కష్టం. చంద్రబాబు ఆయన తనయుడు లోకేష్ టార్గెట్ గా చేసుకుని, ఎన్నో అంశాలపై ముక్కుసూటిగా విమర్శలు చేస్తూ ఉంటారు నాని. అసెంబ్లీ లోనే కాకుండా, ఎక్కడ ఏ మీడియా సమావేశం నిర్వహించినా చంద్రబాబు లోకేష్ ప్రస్తావన తీసుకు వచ్చి, గత టీడీపీ ప్రభుత్వం వ్యవహరించిన తీరు, చంద్రబాబు టిడిపిలో చేరిన తరువాత ఆయన పార్టీని లాక్కుని ఎన్టీఆర్ ను  వెన్నుపోటు పొడిచిన అంశాలను ఇలా వేటిని మర్చిపోకుండా, ప్రతి సందర్భంలోనూ గుర్తు చేస్తూ, వాడు వీడు అంటూ చెడుగూడు ఆడేస్తూ తిట్టిపోస్తుంటారు.

అసలు కొడాలి నాని ప్రెస్ మీట్ పెడుతున్నారు అంటేనే చంద్రబాబులో తీవ్ర అసహనం, ఆందోళన పెరిగిపోతూ ఉంటుంది. నాని ఎంత తీవ్రంగా విమర్శలు చేసినా, తిరిగి ప్రతి విమర్శలు చేసేందుకు చంద్రబాబు ఇష్టపడరు. అసెంబ్లీలోనూ ఇదే పరిస్థితి. ఒకవేళ నాని పై చంద్రబాబు విమర్శలు చేస్తే, ఆ పరిణామాలు ఎంత తీవ్రంగా ఉంటాయి అనేది బాబుకు తెలియంది కాదు. ఆయన మరింతగా విమర్శల డోసు పెంచి మరి తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టేస్తూ ఉంటారు. నాని సైతం చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన వారే అయినా, ఆ కులాన్ని ప్రస్తావించి మరి  విమర్శలు చేస్తూ ఉంటారు.

నాని సంగతి అలా ఉంటే, గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ సైతం చంద్రబాబు లోకేష్ ను టార్గెట్ గా చేసుకునే విమర్శలు చేస్తూ ఉంటారు. కొడాలి నాని స్థాయిలో కాకపోయినా, ఘాటు విమర్శలతో మంట పుట్టిస్థూ ఉంటారు. ఆయన కూడా మొన్నటి వరకు టీడీపీ లోనే ఉండడంతో, ఆ పార్టీలోని అన్ని వ్యవహారాలు, అందరి నాయకుల గురించి క్షుణ్ణంగా తెలుసు. ముఖ్యంగా చంద్రబాబు లోకేష్ ను దగ్గర నుంచి చూసిన వారు కావడంతో, ఆ సంగతులన్నీ గుర్తుచేస్తూనే విమర్శలు చేస్తూ ఉంటారు. వంశీ విషయంలోనూ చంద్రబాబు, లోకేష్ డైరెక్టుగా విమర్శలు చేసే సాహసం చేయలేరు. పార్టీలోని మిగతా నాయకులతో విమర్శలు చేయిస్తూ ఉంటారు తప్ప, నేరుగా వారి పై విమర్శలు చేసే సాహసం చేయలేకపోతున్నారు. దీంతో కొడాలి నాని , వల్లభనేని వంశీ మరింతగా లోకేష్ చంద్రబాబు ని ఓ ఆట వాడేసుకుంటున్నారు.

-Surya

Read more RELATED
Recommended to you

Exit mobile version