విమానాశ్రయ వాటాల విక్రయం!

-

దేశంలో ప్రైవేటైజ్‌ చేసిన విమానాశ్రయాల వాటాలో ప్రభుత్వానికి మిగిలిన వాటాలను విక్రయించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విక్రయాల జాబితాలో బెంగళూరు, హైదరాబాద్, ఢిల్లీ, ముంబై ఉన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ నాలుగు విమానాశ్రయాలలో ఎయిర్‌పోర్ట్‌ అథారిటీ(ఏఏఐ) వాటాలను విక్రయించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో మరో 13 ఎయిర్‌పోర్టులను ప్రైవేటైజ్‌ చేసే దిశగా ప్రభుత్వం యోచిస్తున్నట్లు వివరించాయి. ఈ అమ్మకాల ద్వారా ప్రభుత్వం రూ. 2.5 లక్షల కోట్లను సమకూర్చుకోవాలని చూస్తున్న విషయం విదితమే. గత నెలలో అత్యున్నత కార్యదర్శుల కమిటీ సమావేశంలో ఈ మేరకు ప్రణాళికలు చేసినట్లు తెలుస్తోంది.

నాలుగు ఎయిర్‌పోర్టుల భాగస్వామ్య సంస్థ(జేవీ)లలో ఏఏఐకి ఉన్న వాటాల విక్రయంపై పౌర విమానయాన శాఖ తగిన పర్మిషన్స్‌ పొందనున్నట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి. రానున్న రోజుల్లో అనుమతుల అంశం కేబినెట్‌కు చేరనున్నట్లు తెలియజేశాయి. అయితే, వచ్చే ఏడాదిలో ప్రైవేటైజ్‌ చేస్తున్న జాబితాలోని లాభాలు లేని, లాభాలు గడించే 3 ఎయిర్‌పోర్టులను మిక్స్‌ చేయడం ద్వారా ఆకర్షణీయమైన ప్యాకేజీకి ప్రభుత్వం భావిస్తోంది. తొలి రౌండ్‌లో అదానీ గ్రూప్‌ లక్నో, అహ్మదాబాద్, జైపూర్, మంగళూరు, తిరువనంతపురం, గువాహటి విమానాశ్రయాలను దక్కించుకుంది. ఇదిలా ఉండగా ఏఏఐ నిర్వహణలో దేశవ్యాప్తంగా 100కుపైగా విమానాశ్రయాలున్నాయి.

  • ముంబై ఎయిర్‌పోర్టులో అదానీ గ్రూప్‌ 74 శాతం వాటాను కలిగి ఉంది. ఏఏఐ వాటా 26 శాతం.
  • హైదరాబాద్‌ ఎయిర్‌పోర్టులో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంతోపాటు, ఏఏఐ 26 శాతం వాటాను పొందాయి.కర్ణాటక ప్రభుత్వంతో కలసి బెంగళూరు ఎయిర్‌పోర్టులోనూ వాటా కలిగి ఉంది.
  • ఢిల్లీ విమానాశ్రయంలో జీఎంఆర్‌ గ్రూప్‌ వాటా 54 శాతం.. ఏఏఐ 26 శాతం వాటాను పొందింది. ఫ్రాపోర్ట్, ఎరమన్ మలేషియా 10 శాతం చొప్పున వాటాలను కలిగి ఉన్నాయి.

 

Read more RELATED
Recommended to you

Latest news