ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా బ్యాంకింగ్ ఉద్యోగులు సోమవారం ఒక్కరోజు సమ్మె చేపట్టారు. దీని వల్ల సోమ, మంగళవారాల్లో బ్యాంకింగ్ సేవలకు అంతరాయం ఏర్పడనుంది. యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (యూఎఫ్‌బీయూ) ఆధ్వర్యంలో చేపట్టిన ఈ సమ్మెలో దేశవ్యాప్తంగా ఉన్న 10 లక్షల మంది బ్యాంక్ ఉద్యోగులు పాల్గొంటున్నారు.
కేంద్ర ప్రభుత్వం పెట్టుబడుల ఉప సంహరణలో భాగంగా ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు పరం చేస్తోంది. అందులో భాగంగానే ఇటీవలే ఐడీబీఐ బ్యాంక్‌ను ప్రైవేటీకరించారు. ఇక గత నాలుగేళ్ల కాలంలో మరో 14 పబ్లిక్ సెక్టార్ బ్యాంక్‌లను విలీనం చేశారు. ఈ క్రమంలో బ్యాంకు ఉద్యోగుల సంఘాలు ఇప్పటికే అడిషనల్ చీఫ్ లేబర్ కమిషనర్‌తో తమ సమస్యలపై పలు దఫాల్లో చర్చలు జరిపాయి. అయినప్పటికీ చర్చలు విఫలం అయ్యాయి. దీంతో వారు సోమవారం సమ్మె చేపట్టారు.
ఇక బ్యాంకు ఉద్యోగుల సమ్మె కారణంగా వినియోగదారులకు సేవలు అందించడంలో ఎలాంటి సమస్య ఏర్పడకుండా ఉండేందుకు గాను బ్యాంకులు చర్యలు తీసుకుంటున్నాయి. అయితే బ్యాంకుల్లో నగదు డిపాజిట్లు, ఉప సంహరణలు, చెక్ క్లియరెన్స్‌లు, లోన్ అప్రూవల్స్ వంటి సేవలతోపాటు పలు ఇతర బ్యాంకింగ్ సేవలకు కూడా అంతరాయం ఏర్పడనుంది. అయితే వినియోగదారులకు అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకుంటున్నామని బ్యాంకులు వెల్లడించాయి. సోమ, మంగళవారాల్లో బ్యాంకు సేవలకు అంతరాయం ఏర్పడుతుందని ఆయా బ్యాంకులు వెల్లడించాయి.